హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం.. లోక్‌సభ బరిలో ఖట్టర్!

by Swamyn |
హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం.. లోక్‌సభ బరిలో ఖట్టర్!
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో మంగళవారం ఒక్కరోజే కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మిత్రపక్షం దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో బీజేపీ బంధం తెంచుకోవడం, అనంతరం ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం, ఆ వెంటనే ఎంపీ నయాబ్ సింగ్ సైనీ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టడం.. ఈ పరిణామాలన్నీ ఒక్కరోజులోనే చకాచకా జరిగిపోయాయి. వివరాల్లోకెళ్తే, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న బీజేపీ, జేజేపీ మధ్య లోక్‌సభ సీట్ల అంశంలో విభేదాలు తలెత్తాయి. దీంతో బీజేపీతో పొత్తును తెంచుకున్న జేజేపీ.. అధికార కూటమికి మద్దతును ఉపసంహరించుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 10 ఎంపీ స్థానాలకు గానూ రెండింట్లో పోటీ చేసేందుకు జేజేపీ ఆసక్తి చూపగా.. అందుకు బీజేపీ నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధికార కూటమి నుంచి జేజేపీ బయటకు వచ్చింది. ఈ నిర్ణయంతో బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీకి 41, కాంగ్రెస్ 30, జేజేపీ 10, ఐఎన్‌ఎల్‌డీ 1, హెచ్‌ఎల్‌పీ 1, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. మెజారిటీకి 46 సీట్లు కావాల్సి ఉంది. బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 41 మంది బీజేపీ సభ్యులు, 10 జేజేపీ, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. జేజేపీ కూటమి నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్ బండారు దత్తాత్రేయ వెంటనే ఆమోదించారు.

సీఎంగా సైనీ ప్రమాణం

ఖట్టర్ రాజీనామా అనంతరం వెంటనే శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన బీజేపీ నేతలు.. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ, స్టేట్ పార్టీ చీఫ్ నయాబ్ సింగ్ సైనీని సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలుండగా, ఆరుగురు స్వతంత్రులు, ఏకైక ఎమ్మెల్యే ఉన్న ‘హర్యానా లోఖిత్ పార్టీ’(హెచ్ఎల్పీ) మద్దతుతో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం చండీగఢ్‌లో నిర్వహించిన వేడుకలో గవర్నర్ బండారు దత్తాత్త్రేయ నయాబ్ సైనీతో సీఎంగా ప్రమాణం చేయించారు. సైనీతోపాటు ఖట్టర్ కేబినెట్‌లో ఉన్న జేపీ దలాల్, మూల్‌చంద్ శర్మ, బన్వరి లాల్, కాన్వార్ పాల్ గుర్జర్ సైతం మరోసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

సైనీ ప్రస్థానం..

సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మిజాపూర్ మజ్రా గ్రామంలో జన్మించారు. 1996లో బీజేపీలో చేరిన సైనీ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2016లో ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. దాదాపు 4 లక్షల ఓట్ల తేడాతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ సింగ్‌పై విజయం సాధించారు. 2023 అక్టోబర్ 27నుంచి హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో సుధీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సైనీని బీజేపీ అధిష్టానం తాజాగా సీఎంగా ఎంపిక చేసింది.

కురుక్షేత్రం నుంచి ఖట్టర్

మరోవైపు, మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎంగా రాజీనామా చేయించిన అధిష్టానం.. అతన్ని లోక్‌సభ బరిలో నిలపనున్నట్టు తెలుస్తోంది. నయీబ్ సింగ్ సైనీ సిట్టింగ్ స్థానమైన కురుక్షేత్ర నుంచే ఖట్టర్ పోటీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.



Advertisement

Next Story

Most Viewed