ముగిసిన పట్నాయక్ పాలన.. ఒడిశా కొత్త సీఎం ఎవరంటే?

by Shamantha N |
ముగిసిన పట్నాయక్ పాలన.. ఒడిశా కొత్త సీఎం ఎవరంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు ఓటమి తప్పలేదు. 24 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన రికార్డుకు బ్రేక్ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో నవీన్ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ కు రాజీనామా లేఖను అందించారు. గవర్నర్ వెంటనే దాన్ని ఆమోదించారు. తాత్కాలిక సీఎంగా కొనసాగాలని నవీన్ పట్నాయక్ ను కోరారు. మొత్తం 147 సీట్లున్న ఒడిశాలో బీజేపీ 78 స్థానాలతో గెలుపొందింది. బీజేడీకి 51, కాంగ్రెస్ కు 14, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా.. ఎవర్ని సీఎం పదవి వరిస్తుందో తెలియాల్సి ఉంది.

జూన్ 10న సీఎం ప్రమాణస్వీకారం

ఒడిశా సీఎం ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ ఊహాగానాల మధ్య బీజేపీ ఒడిశా చీఫ్ మన్మోహన్ సమల్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేశారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు రెండ్రోజుల్లో సీఎం ఎవరనేదానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జూన్ 10న బీజేపీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని మోడీ గతంలో చెప్పిన మాటలను గుర్తుచేశారు. ముఖ్యంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాన్ని నిలబెట్టే ఒడియావారే సీఎం అవుతారని సమాల్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒడిశా సీఎం ఎవరు?

ఈ క్రమంలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర మాజీ మంత్రి జోయల్‌ ఓరం, భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్‌ పండ సీఎం రేసులో ముందున్నారు. వీరేకాకుండా.. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, బాలాసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి, జమ్ముకశ్మీర్ మాజీ ఎల్జీ గిరీష్ చంద్ర కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు. అయితే, వీరంగా లోక్ సభ స్థానాల్లో విజయం సాధించడంతో.. ఒడిశా సీఎంగా కొత్తవారిని కమల పార్టీ పరిచయం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో, నవీన్ పట్నాయక్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Advertisement

Next Story