- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ప్లీజ్.. నరేశ్ గోయల్ పిటిషన్
దిశ, నేషనల్ బ్యూరో : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ బెయిల్ కోసం మరోసారి బాంబే హైకోర్టు తలుపుతట్టారు. తన భార్య ఆరోగ్యం బాగా దెబ్బతిన్నందున, చివరి రోజుల్లో ఆమెకు సాయంగా ఉండేందుకు మెడికల్ బెయిల్‌ను మంజూరు చేయాలని కోరారు. ‘‘నా భార్య క్యాన్సర్ చివరి దశలో చావు బతుకుల మధ్య ఉంది. ఆమె ఇంకొన్ని నెలలే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. ఇక బతికుండాలన్న ఆశ కూడా ఆమెకు లేదు. జీవిత చరమాంకంలో నా భార్య పక్కన ఉండేందుకు బెయిల్ ఇవ్వండి’’ అని కోర్టును ఆయన అభ్యర్థించారు.గోయల్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే బృందం.. బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఎదుట శుక్రవారం వాదనలు వినిపించింది.
భార్యభర్తలిద్దరికీ క్యాన్సరే..
‘‘నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనిత ఇద్దరూ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆయన భార్య పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇంకొన్ని నెలలే బతుకుతుందని వైద్యులు చెప్పారు. శరీరం కంటే మనసు చాలా బలహీనమైంది. భార్య చనిపోతుందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో ఆమెకు సొంతవారి ప్రేమ ఎంతో అవసరం. ఆ కొద్ది నెలలైనా తన భార్యతో ఉండేలా ఆయనకు స్వేచ్ఛ కల్పించండి’’ అని గోయల్ తరఫు లాయర్లు కోర్టుకు రిక్వెస్ట్ చేశారు. అయితే, గోయల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. ప్రస్తుతం ఆయనను డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అంగీకరించలేదని పేర్కొంది. కావాలంటే మరో నెల రోజులు ప్రైవేటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవచ్చని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మే 6వ తేదీకి తీర్పును వాయిదా వేసింది. అప్పటివరకు నరేశ్ గోయల్‌ను డిశ్చార్జ్ చేయొద్దని ఆదేశించింది.
ఏమిటీ కేసు ?
‘జెట్ ఎయిర్‌వేస్’కు కెనరా బ్యాంకు రూ.848.86 కోట్ల లోన్ ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు వేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టి జెట్ ఎయిర్‌వేస్ మోసం చేసినట్లు తేల్చింది. గతేడాది సెప్టెంబరు 1న నరేశ్ గోయల్‌ను ఈడీ అరెస్టు చేసింది.