Mystery Disease: కాంగోలో అంతుచిక్కని వ్యాధి.. 50 మంది మృతి

by vinod kumar |
Mystery Disease: కాంగోలో అంతుచిక్కని వ్యాధి.. 50 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Cango) వాయువ్య ప్రాంతంలో ఓ అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ప్రజలకు గుర్తు తెలియని వైరస్ సోకి ఐదు వారాల్లోనే 50 మంది ప్రాణాలు కోల్పోయారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లల్లో మొదట ఈ వ్యాధిని గుర్తించగా క్రమంగా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అంతేగాక ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం వంటివి వ్యాధి లక్షణాలుగా ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) వివరాల ప్రకారం.. జనవరి 21న కాంగోలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వెలుగు చూడగా ఫిబ్రవరి 16 నాటికి 431 కేసులు నమోదు కాగా 53 మరణాలు సంభవించాయి. వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్లూహెచ్‌ఓ హెచ్చరించింది.

వ్యాధిని గుర్తించడానికి ప్రయత్నం: డబ్లూహెచ్ఓ

కాంగోలో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డబ్లూహెచ్ఓ తెలిపింది. వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను పరీక్షిస్తున్నట్టు పేర్కొంది. మరణించిన వారికి ఇప్పటికే ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉందా అని కూడా పరిశోధనలు జరుపుతున్నట్టు వెల్లడించింది. వ్యాధి బారిన పడిన వారి నుంచి నమూనాలను సేకరిస్తు్న్నారు. ఇందులో ఎబోలా. మార్బర్గ్ నమూనాలను కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, గత దశాబ్దంలో జంతువుల నుంచి మానవులకు అనేక వ్యాధులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికాలో ఇటువంటి కేసులు 60 శాతం పెరిగాయి. వీటిలో అనేక వైరస్‌లు గబ్బిలాలు, కోతులు, పక్షుల ద్వారా వ్యాపిస్తున్నాయి.

Next Story

Most Viewed