Kolkata Doctor : రహస్యాలు బయటపడతాయనే భయంతోనే జూనియర్ వైద్యురాలిని కడతేర్చారేమో : బెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ అడ్వైజర్

by Hajipasha |
Kolkata Doctor : రహస్యాలు బయటపడతాయనే భయంతోనే జూనియర్ వైద్యురాలిని కడతేర్చారేమో : బెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ అడ్వైజర్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి‌పై ఆగస్టు 9న జరిగిన హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ అడ్వైజర్ డాక్టర్ కౌశిక్ లాహిరి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలేజీకి సంబంధించిన ఏదో విషయాన్ని ఆ జూనియర్ వైద్యురాలు బహుశా తెలుసుకొని ఉండొచ్చు. దాన్ని అందరికీ చెప్పేందుకు ఆమె సిద్ధం కావడంతో కడతేర్చి ఉంటారని నా అనుమానం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ కౌశిక్ లాహిరి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలేజీలో జరుగుతున్న ఏదో గోల్‌మాల్ వ్యవహారం బయటపడకూడదనే ఉద్దేశంతోనే జూనియర్ వైద్యురాలిని చంపి ఉండొచ్చు’’ అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆగస్టు 9న జరిగిన దురాగతాన్ని తలుచుకుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. జూనియర్ వైద్యురాలు సూసైడ్ చేసుకోలేదని, అది హత్యే అన్న విషయం అందరికీ తెలుసన్నారు.

యూడీ కేసు అంటే..

‘‘రోడ్డు ప్రమాదం, రైలు ప్రమాదం లాంటివి జరిగినప్పుడు డెడ్‌బాడీలను గుర్తుపట్టలేనప్పుడు యూడీ కేసులను నమోదు చేస్తుంటారు. యూడీ అంటే అన్ క్లెయిమ్డ్ డెడ్ బాడీ. ఆగస్టు 9న తెల్లవారుజామున 3 గంటల టైంలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. విద్యార్థి పేరెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, అదే రోజు మధ్యాహ్నం 1.47 గంటలకు యూడీ కేసును నమోదు చేశారు. స్వయంగా బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ఈవిషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. యూడీ కేసును ఎందుకు నమోదు చేశారనేది ఎవరికీ అర్థం కావడం లేదు’’ అని డాక్టర్ కౌశిక్ లాహిరి పేర్కొన్నారు. ‘‘జూనియర్ వైద్యురాలు చనిపోయాక డెడ్ బాడీని చూసేందుకు అందరినీ వెంటవెంటనే అనుమతించారు. కానీ పేరెంట్స్‌ను గంటల తరబడి వెయిట్ చేయించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక గానీ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయలేదు. ఆగస్టు 9న రాత్రి 8.30 గంటలకు అంత్యక్రియలు జరిగిన టైంలో రాజకీయ నాయకులు, కాలేజీ అధికారుల సంతకాలు తీసుకున్నారు. కానీ బాధితురాలి పేరెంట్స్ సంతకాలు తీసుకోలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని డాక్టర్ కౌశిక్ లాహిరి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed