ముంబై హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

by S Gopi |
ముంబై హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీంతో కారును అతివేగంగా నడిపి ఓ మహిళ మరణానికి కారణమైన కేసులో మిహిర్ షాతో పాటు అతని తల్లి, ఇద్దరు సోదరీమణులు సహా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన తర్వాత నుంచి పరారీలో ఉన్న నిందితుడు 72 గంటల తర్వాత పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో అతను తప్పించుకునేందుకు అతని తల్లి, సోదరీమణులు సహకరించారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, అరెస్ట్ చేసిన ముగ్గురు మహిళలను నిందితులుగా చేర్చాలా వద్దా అనే విషయంపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముంబైకి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్‌లోని అపార్ట్‌మెంట్‌లో మిహిర్ షా పట్టుబడ్డాడు. మిహిర్ షా సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో కీలక నేత అయిన రాజేష్ షా కుమారుడు. ఆదివారం ఉదయం ప్రమాదం జరిగిన తర్వాత నుంచి మిహిర్ పరారీలో ఉన్నాడు. అతని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బాధిత మహిళ కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మిహిర్ షా ఆదివారం అర్ధరాత్రి జుహూలోని ఓ బార్‌లో మద్యం సేవించాడు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో వర్లీ ప్రాంతంలో ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్కూటర్‌పై ఉన్న దంపతులు కిందపడిపోగా, కావేరి నఖ్వా అనే మహిళ కారు కింద పడటంతో మరణించింది.

Advertisement

Next Story

Most Viewed