Indonesia: ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనం, 9 మంది మృతి

by Shamantha N |
Indonesia: ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనం, 9 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేసియాలోని మౌంట్‌ లెవొటోబి లకిలకి(Mount Lewotobi Laki-Laki) అగ్నిపర్వతం(volcano) బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో కనీసం 9 మంది మృతి చెందారు. ఫ్లోర్స్‌ దీవిలోని మౌంట్‌ లెవొటోబి లకిలకిలో అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం నుంచి ప్రతిరోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందంపాటి బూడిద అగ్నిపర్వతం నుంచి వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. విస్ఫోటనాలు డేంజర్‌ జోన్‌ను దాటిపోయాయని అధికారులు ప్రకటించారు. అగ్నిపర్వతం నుంచి బూడిద వెదజల్లుతుండటంతో ఆ వేడి బూడిద పడి సమీపంలోని పలు నివాసాలు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

‘‘అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన మెరుపులతో భారీ వర్షం కురుస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నాం’’ అని వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) సెంటర్ ప్రతినిధి తెలిపారు. ఇకపోతే, ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్‌ జోన్‌లుగా ప్రకటించామన్నారు. ఈ ఏడాది మేలో హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం చెందడంతో 60 మందికి పైగా మరణించారని, సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed