Mohan Yadav: ఆ ప్రాంతాల్లో మాంసం, మద్యం నిషేధించండి: సీఎం మోహన్ యాదవ్

by vinod kumar |
Mohan Yadav:  ఆ ప్రాంతాల్లో మాంసం, మద్యం నిషేధించండి: సీఎం మోహన్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నర్మదా నది ఒడ్డున ఉన్న మతపరమైన పట్టణాల్లో మాంసం, మద్యం వినియోగించకుండా చూడాలని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. నర్మదా నది స్వచ్ఛత, అంతరాయం లేకుండా ప్రవహించేలా సమగ్ర అభివృద్ధిపై కేబినెట్ కమిటీ తొలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శనివారం వెల్లడించారు. భవిష్యత్తులో స్థావరాల కోసం, నదికి దూరంగా భూమిని గుర్తించాలన్నారు. నది పొడవునా ఏ స్థావరం నుంచి కూడా మురుగునీరు నదిలోకి ప్రవహించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నదిలో యంత్రాల ఆధారిత మైనింగ్ కార్యకలాపాలను నిషేధించాలని సూచించారు.

ఓంకారేశ్వర్‌లో ఉన్న మమలేశ్వర్ ఆలయాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, దీని కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)తో చర్చలు జరపాలని తెలిపారు. జీఐఎస్, డ్రోన్ సర్వే ద్వారా నర్మదా నదికి ఇరువైపులా ఉన్న విస్తీర్ణాన్ని గుర్తించి ఆయా ప్రాంతాల పరిరక్షణకు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ధార్మిక, సాంస్కృతిక పర్యాటక కార్యకలాపంగా నర్మదా నదిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా, నర్మదా నది ఒడ్డున 430 పురాతన శివాలయాలు, రెండు శక్తి పీఠాలు ఇతర దేవాలయాలు ఉన్నాయి.

Advertisement

Next Story