IND VS BAN : కుర్రాళ్లు ఏం చేస్తారో.. నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20

by Harish |   ( Updated:2024-10-05 20:25:44.0  )
IND VS BAN : కుర్రాళ్లు ఏం చేస్తారో.. నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది టీమ్ ఇండియా ఎక్కువగా టీ20లనే ఆడింది. జనవరిలో అఫ్గాన్‌తో, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, అనంతరం జింబాబ్వే, శ్రీలంక పర్యటనలతో పొట్టి క్రికెట్‌తో బిజీగా గడిపింది. కానీ, ఇటీవల టీ20లకు చిన్న బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత టెస్టు ఫార్మాట్ ఆడింది. ఇటీవలే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను ముగించగా.. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ భారత జట్టు ‘పొట్టి’ సమరానికి సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ నేటి నుంచే ప్రారంభం. నేడు గ్వాలియర్ వేదికగా తొలి టీ20. సీనియర్లు పూర్తిగా దూరంగా ఉంటున్న ఈ సిరీస్‌లో సూర్యకుమార్ నాయకత్వంలో కుర్రాళ్లు ఏం చేస్తారో చూడాలి.

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ విజయం సాధించిన భారత జట్టు టీ20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నది. పొట్టి క్రికెట్‌లో బంగ్లాపై తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాలని భావిస్తున్నది. పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టునే సెలెక్టర్లు టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. టెస్టులు ఆడిన వారికి విశ్రాంతినిచ్చారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, యువ పేసర్లు హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మరి, తొలి టీ20లో ఎవరు అరంగేట్రం చేస్తారో చూడాలి. కుర్రాళ్లతో నిండినప్పటికీ నాణ్యమైన ఆటగాళ్లతో జట్టు బలంగానే కనిపిస్తున్నది. ఓపెనర్లుగా అభిషేక్, సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. జట్టులోకి వస్తూ పోతున్నా శాంసన్‌‌కు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రియాన్ పరాగ్‌‌ వంటి హిట్టర్లతో బ్యాటింగ్‌కు ఢోకా లేదు. దూబె దూరమవడంతో జట్టులోకి వచ్చిన తిలక్ వర్మకు తుది జట్టులో చోటుపై సందిగ్ధం నెలకొంది. జితేశ్ శర్మ నుంచి అతనికి పోటీ నెలకొంది. పేస్ దళాన్ని పాండ్యాతో కలిసి అర్ష్‌దీప్ సింగ్ నడిపించనున్నాడు. ఐపీఎల్‌లో మెరిసిన యువ పేసర్లు హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లపై అందరి దృష్టి నెలకొంది. వీరిలో ఒకరు తొలి టీ20లో అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు చోటు ఖాయంగా కనిపిస్తుండగా.. మరో స్పిన్నర్ బెర్త్ కోసం వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ పోటీపడుతున్నారు. బ్యాటింగ్ గురించి ఆలోచిస్తే సుందర్‌ను తీసుకోవచ్చు.

14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో..

14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌ అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదిక కానుంది. 2010లో సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో సచిన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ బాదాడు. 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌‌కు అంతర్జాతీయ క్రికెట్ తిరిగి వచ్చింది. అయితే, కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో కాకుండా కొత్త నిర్మించిన శ్రీమంత్ మాధవరావు సింధియా స్టేడియం‌లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్

భారత్‌దే ఆధిపత్యం

బంగ్లాదేశ్‌తో ఇప్పటివరకు జరిగిన టీ20ల్లో భార‌త్‌దే పూర్తి ఆధిపత్యం. ఇరు జట్లు 13 సార్లు తలపడగా టీమిండియా 12 విజయాలు నమోదు చేసింది. బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది.

తుది జట్లు(అంచనా)

భారత్ : అభిషేక్ శర్మ, శాంసన్, సూర్యకుమార్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ/తిలక్ వర్మ, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్/వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్/మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

బంగ్లాదేశ్ : లిటాన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహముదుల్లా, జాకెర్ అలీ, మెహిది హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ షకీబ్.

Advertisement

Next Story