రైతు సదస్సు కోసం వారణాసికి మోడీ

by Harish |   ( Updated:2024-06-11 09:04:38.0  )
రైతు సదస్సు కోసం వారణాసికి మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానిగా మోడీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో జూన్ 18న పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే రైతు సదస్సులో ప్రసంగిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రొహనియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతు సదస్సుకు వేదికను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు స్థానిక బీజేపీ నాయకులు ఒక ప్రకటనలో చెప్పారు. మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించడానికి గులాబ్‌బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో మహానగర జిల్లా అధికారుల సమావేశం నిర్వహించారు.

బీజేపీ కాశీ ప్రాంత అధ్యక్షుడు దిలీప్ పటేల్ మాట్లాడుతూ, రైతులను ఉద్దేశించి మోడీ ఈ సదస్సులో మాట్లాడుతారని, రోజంతా ఆయన పర్యటన నియోజకవర్గంలో కొనసాగుతుందని తెలిపారు. రైతుల సదస్సులో ప్రసంగించిన అనంతరం ప్రధాని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేస్తారని, దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొంటారని పటేల్ చెప్పారు.

రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ తన నియోజకవర్గానికి రానుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని దిలీప్ పటేల్ సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో, ప్రధాని మోడీ తన వారణాసి స్థానాన్ని వరుసగా మూడోసారి నిలబెట్టుకున్నారు, కాంగ్రెస్‌కు చెందిన అజయ్ రాయ్‌ను 1.5 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు.

Advertisement

Next Story

Most Viewed