మోడీ అమెరికా పర్యటన ఇలా సాగింది..

by John Kora |
మోడీ అమెరికా పర్యటన ఇలా సాగింది..
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికార పర్యటన తర్వాత ప్రధాని మోడీ ఫిబ్రవరి 13న అమెరికా చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే ఆయనకు ఇండియా అంబాసిడర్ వినయ్ మోహన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోడీ నేరుగా బ్లెయిర్ హౌస్‌కు వెళ్లారు. 200 ఏళ్ల నాటి బ్లెయిర్ హౌస్ కేవలం ప్రభుత్వ అతిథులు, దేశాధినేతలకు మాత్రమే కేటాయిస్తారు. వైట్ హౌస్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్లెయిర్ హౌస్‌ను 1824లో నిర్మించగా.. 1837లో బ్లెయిర్ కుటుంబం చేతికి వెళ్లింది. అప్పటి నుంచి దీన్ని స్థానికులు బ్లెయిర్ హౌస్‌గా పిలుస్తున్నారు. ఈ భవనంలో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. 119 గదులు, 14 గెస్ట్ బాత్రూమ్‌లతో పాటు అతిథుల కోసం 35 ప్రత్యేక బాత్రూంలు కూడా ఉన్నాయి. మూడు భారీ డైనింగ్ హాల్స్, ఒక బ్యూటీ సెలూన్ కూడా బ్లెయిర్ హౌస్‌లో ఉంది.

ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు మోడీ వైట్ హౌస్ చేరుకున్నారు. మొదటిగా యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌తో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక నిఘా సహకారాన్ని పెంపొందించుకోవడం, ఉగ్రవాద వ్యతిరేకత, సైబర్ భద్రత, వ్యూహాత్మక నిఘా సమాచారాన్ని పంచుకోవడంపై ఇద్దరి మధ్య ప్రత్యేక చర్చ జరిగింది. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైఖెల్ వాల్జ్‌తో సమావేశమయ్యారు. వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారం, పౌర అణుశక్తిలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లకు ప్రాధాన్యం, ఉగ్రవాద నిరోధక కార్యాకలాపాలు ప్రధానాంశాలుగా ఈ భేటీ జరిగింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజే) అధినేత ఎలాన్ మస్క్‌ను కలిశారు. కొత్తగా తెర మీదకు వస్తున్న టెక్నాలజీలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం, సుపరిపాలన.. రంగాల్లోనూ ద్వైపాక్షిక సహకారాన్ని ఇప్పటి కన్నా మరింతగా విస్తృతపర్చుకోవడానికి ఉన్న అవకాశాలపైనా వారు చర్చించారు.

రెండవ రోజు నేరుగా వైస్ హౌస్‌కు చేరుకొని ప్రెసిడెంట్ ట్రంప్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల నేతలు ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. సాయంత్రం ప్రెసిడెంట్ ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో మోడీ పాల్గొన్నారు. అనంతరం పీఎం మోడీ ఇండియాకు బయలు దేరారు.

Next Story