ఢిల్లీలో నీటి సరఫరాను పరిశీలించిన మంత్రి అతిషి

by Harish |   ( Updated:2024-06-30 10:12:26.0  )
ఢిల్లీలో నీటి సరఫరాను పరిశీలించిన మంత్రి అతిషి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది వేసవిలో ఎన్నడూలేని విధంగా నీటి కొరతను ఎదుర్కొన్న దేశ రాజధానికి ఇటీవల మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట కల్పించాయి. దీంతో కొన్ని ఏరియాల్లో తాత్కాలికంగా నీటి సమస్య తీరిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి అతిషి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని పంప్‌హౌస్‌‌ను మంత్రి అతిషి సందర్శించారు. ఈ సందర్భంగా మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని, తిరిగి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి ఆదివారం అధికారులను ఆదేశించారు.

అనూహ్య వర్షాల వల్ల ఈ ప్లాంట్‌లో మోటార్లు దెబ్బతిన్నాయి. దీంతో సెంట్రల్ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి జల్ బోర్డు త్వరగా పనిచేసింది. ప్లాంట్ దాదాపు 80 శాతం మరమ్మతులకు గురైంది. నీటి సరఫరా త్వరలో సాధారణ స్థితికి వస్తుందని అతిషి చెప్పారు.

అలాగే, వర్షాలు విస్తారంగా కురుస్తుండటం వలన నగరంలో నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. యమునా నదిలో కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. దీంతో నగరానికి అవసరమైన నీటి సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల శుక్రవారం ఢిల్లీలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి.

Advertisement

Next Story

Most Viewed