‘ఉపాధి’ కూలీల వేతనం పెంపు.. తెలంగాణ, ఏపీలలో ఎంతో తెలుసా ?

by Dishanational4 |
‘ఉపాధి’ కూలీల వేతనం పెంపు.. తెలంగాణ, ఏపీలలో ఎంతో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ రాష్ట్రాల పరిధిలో ఉపాధిహామీ కూలీలకు సగటున 4 నుంచి 10 శాతం మేర వేతనాలను పెంచింది. కూలీల వేతనాల సవరణలో భాగంగా ప్రభుత్వం ఈమేరకు వేతనాల పెంపుదలను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ వచ్చాకే.. ఉపాధి హామీ కూలీల వేతన సవరణ వివరాలను మార్చి 27న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫై చేసింది. దీనిలో భాగంగా నైపుణ్యం లేని ఉపాధి హామీ కూలీలకు హర్యానాలో అత్యధికంగా రోజుకు రూ.374 చొప్పున వేతనం అందనుండగా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో అత్యల్పంగా రోజుకు రూ.234 చొప్పున అందనుంది. సిక్కింలోని మూడు పంచాయతీలు గ్నాతంగ్, లాచుంగ్, లాచెన్‌లలో రోజువారీ సగటు వేతనం రూ. 374 చొప్పున అందించనున్నారు.

దేశంలోనే అత్యధికంగా గోవాలో..

రోజువారీ వేతన పెంపు రేటు దేశంలోనే అత్యధికంగా గోవాలో రూ.34గా ఉంది. ప్రస్తుతం అక్కడ ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం రూ.356. ఆంధ్రప్రదేశ్‌లో దినసరి వేతనం రూ.28 చొప్పున పెరిగి రూ.300కు చేరగా.. తెలంగాణలో దినసరి వేతనం రూ.28 చొప్పున పెరిగి రూ.300కు చేరింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో దినసరి వేతనం పెరుగుదల అత్యల్పంగా రూ.7గా ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో పని చేసే కార్మికులకు రోజువారీ వేతనం రూ.237 చొప్పున అందనుంది. ఉపాధి హామీ వేతనాలు పశ్చిమ బెంగాల్‌లో రూ.250 (రూ.13 పెరుగుదల), తమిళనాడులో రూ.319 (రూ.25 పెరుగుదల), బీహార్‌లో రూ.228 (రూ.17 పెరుగుదల)గా నిర్ణయించారు. ఉపాధి కూలీల రోజువారీ వేతన రేటు విషయంలో హర్యానా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్రంలో కూలీ పెరుగుదల కేవలం నాలుగు శాతమే జరిగింది. తెలంగాణ, ఏపీ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 10 శాతం వేతన పెరుగుదల నమోదైంది.


Next Story

Most Viewed