జమ్మూకశ్మీర్‌ డీజీపీ స్థానిక ప్రజలను పాకిస్థానీయులుగా చూస్తున్నారు: మెహబూబా ముఫ్తీ

by Harish |
జమ్మూకశ్మీర్‌ డీజీపీ స్థానిక ప్రజలను పాకిస్థానీయులుగా చూస్తున్నారు: మెహబూబా ముఫ్తీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం కేంద్ర ప్రభుత్వం, డీజీపీపై విమర్శలు చేశారు.లోయలో ఇటీవల కాలంలో వరుసగా ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికి ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. దోడా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించడాన్ని ఆమె ఖండించారు. ఈ దాడిలో వీర జవాన్లను, అధికారులను కోల్పోయాము. దీనికి ఎటువంటి జవాబుదారీతనం లేదు, ప్రస్తుత డీజీపి రాజకీయంగా విషయాలు చక్కదిద్దడంలో బిజీగా ఉన్నారు. ఆయన స్థానిక ప్రజలను పాకిస్థానీయులుగా చూస్తున్నారు. పీడీపీని ఎలా అణిచివేయాలో, ప్రజలను ఎలా వేధించాలో ఆలోచిస్తున్నారని మెహబూబా ఆరోపించారు.

గత 32 నెలల్లో దాదాపు 50 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎవరూ జవాబుదారీగా వ్యవహరించడం లేదని ఆమె అన్నారు. జమ్మూకశ్మీర్‌‌లో ఎక్కువ మంది వ్యక్తులపై UAPA ప్రయోగిస్తున్నారు. వ్యాపార వర్గాలను వేధిస్తున్నారు, మతాధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ముఫ్తీ విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో గత ఆరేళ్లుగా బీజేపీ ప్రత్యక్ష పాలనలో ఉంది, ఇంకా దోడా లాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. గతంలో ఎప్పుడూ ఉగ్రదాడులు జరగని ప్రాంతాల్లోనే ఈ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇక్కడ యువకులు చనిపోతున్నారు. లోయలో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని గత ఆరేండ్లుగా కేంద్ర పాలకులు చెబుతున్నారు, కానీ పరిస్ధితి అందుకు విరుద్ధంగా ఉందని ఆమె శ్రీనగర్‌లో విలేకరులతో అన్నారు.

Advertisement

Next Story

Most Viewed