Delhi Chief Minister : ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు?

by Shamantha N |
Delhi Chief Minister : ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా (Manish Sisodia).. ఇవాళ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)తో భేటీ అయ్యేందుకు ఆయన నివాసానికివెళ్లనున్నారు. సీఎం పదవికి (Delhi Chief Minister) కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటన చేసిన తర్వాత ఆయనతో సిసోడియా తొలిసారి భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తదుపరి సీఎం ఎవరన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

తెరపైకి నలుగురి పేర్లు

ఇదే సమయంలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఢిల్లీ మంత్రి అతిశీ. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఆమె పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు. ఆమెతో పాటు సౌరభ్‌ భరద్వాజ్‌, కైలాశ్‌ గెహ్లాట్‌, గోపాల్‌ రాయ్‌ పేర్లను ఆప్‌ పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక మనీశ్‌ సిసోడియా.. కేజ్రీవాల్‌ బాటలోనే పయనిస్తున్నారు. ప్రజలు తన నిజాయితీని ఆమోదిస్తే మాత్రమే తాను కూడా మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా తిరిగి వస్తానంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

కేజ్రీవాల్ రాజీనామా

కాగా, మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌.. ఆరు నెలలపాటు జైళ్లో ఉన్నారు. ఆతర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి తన స్థానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed