Mangaluru: విషాదంగా మారిన కర్ణాటక వ్యాపారి మిస్సింగ్ మిస్టరీ

by Shamantha N |
Mangaluru: విషాదంగా మారిన కర్ణాటక వ్యాపారి మిస్సింగ్ మిస్టరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్‌ అలీ (52) మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మిగిలింది. ఆదివారం నుంచి దాదాపు 12 గంటల పాటు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులు.. సోమవారం అతడి మృతదేహాన్నిగుర్తించారు. ఫాల్గుణి నది దగ్గర ఆయన డెడ్ బాడీని గుర్తించారు. ఆదివారం ఉదయం ముంతాజ్ అలీ అదృశ్యమయ్యారు. కాగా.. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. బీఎం ముంతాజ్ ధ్వంసమైన అతడి కారును కుల్లూరు వంతెన సమీపంలో వదిలివెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే, అతడి ఆచూకీ కోసం 12 గంటలుగా శ్రమించి చివరకు ఫాల్గుణి నది దగ్గర డెడ్ బాడీని గుర్తించారు. బీఎం ముంతాజ్ అలీ మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్‌ బవ సోదరుడే కావడం గమనార్హం.

కావూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్

ప్రముఖ వ్యాపారిగానే కాకుండా అలీకి.. మిస్బా గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ ఛైర్మన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అలీ తన ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 5 గంటల సమయంలో కుల్లూరు వంతెన సమీపంలో తన వాహనాన్ని పార్కింగ్‌ చేసేముందు నగరమంతా చక్కర్లు కొట్టినట్లు పేర్కొన్నారు. అతడి కుమార్తె పోలీసులను సంప్రదించడంతో పెద్దఎత్తున అతడి ఆచూకీ కోసం గాలించారు. అలీ అదృశ్యమైన వ్యవహారంపై కావూరు పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని డబ్బుల కోసం బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చేసిన ఆరోపణలపై ఓ మహిళతో పాటు ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. సోమవారం అలీ మృతదేహాన్ని వెలికితీసినట్లు మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ అనుపమ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. మరణానికి గల కారణాలను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నగరంలోని ఏజే ఆస్పత్రికి తరలించామన్నారు.

Advertisement

Next Story

Most Viewed