మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం.. మోడీ రియాక్షన్ ఇదే..

by Swamyn |
మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం.. మోడీ రియాక్షన్ ఇదే..
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయమైంది. ఆమె నివాసంలో కింద పడటంతో నుదుటిపై తీవ్రగాయమై రక్తస్రావమైంది. ఆ రక్తపు ధార నుదుటి నుంచి గొంతువరకు కారింది. ఇందుకు సంబంధించిన ఫొటోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఫొటోలో మొహంపై రక్తంతో ఉన్న ఆమె.. ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ఉన్నారు. ‘‘మన చైర్ పర్సన్‌ మమతా బెనర్జీకి తీవ్రగాయమైంది. ఆమె కోసం ప్రార్థించండి’’ అంటూ టీఎంసీ ట్వీట్ చేసింది. దీనిపై కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మనిమోయ్ బెనర్జీ మాట్లాడుతూ, ‘‘సీఎం మమతా బెనర్జీ గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో తలకు గాయంతో ఆస్పత్రిలో చేరారు. ఆమె ఇంటి పరిసరాల్లో వెనుక నుంచి తోసినట్టనిపించడంతో కింద పడినట్టు వెంట వచ్చినవారు నాతో చెప్పారు. కింద పడటంతో తలకు బలమైన దెబ్బతాకి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమె నుదుటిపై లోతుగా గీసుకుపోయింది. దీంతో రక్తస్రావం ఎక్కువగా అయింది. ముక్కుపై కూడా దెబ్బతాకింది’’ అని వెల్లడించారు. గాయమైన చోట కుట్లు వేసి, డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. తనతోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉన్నారు. అయితే, తన ట్రెడ్ మిల్‌పై వాకింగ్ చేస్తుండగా అదుపుతప్పి పడిపోయారని, మిషన్‌కు ఉన్న మెటల్ వస్తువు గుచ్చుకొవడంతో గాయమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మోడీతోపాటు పలువురి స్పందన

మమతా బెనర్జీకి గాయమవడంపై ప్రధాని మోడీతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోడీ స్పందిస్తూ, ‘‘మమతా దీదీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. గాయంతో ఉన్న మమతా బెనర్జీ ఫొటోలు చూసి షాక్‌కి గురయ్యాయనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. వీరితోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ సైతం దీదీ వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమత కాలుకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో వీల్‌ చైర్‌లో కూర్చునే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed