Mallikarjun karge: జమ్మూ కశ్మీర్‌లో మోడీకి ఎగ్జిట్ డోర్ తప్పదు: మల్లికార్జున్ ఖర్గే

by vinod kumar |
Mallikarjun karge: జమ్మూ కశ్మీర్‌లో మోడీకి ఎగ్జిట్ డోర్ తప్పదు: మల్లికార్జున్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ అండ్ కంపెనీకి ఎగ్జిట్ డోర్ చూపెట్టేందుకు జమ్మూ కశ్మీర్ యువత సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. కశ్మీర్ యువతను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘కశ్మీర్‌లో యువత నిరుద్యోగ రేటు మార్చిలో 28.2 శాతంగా ఉంది. అనేక పరీక్షా పత్రాల లీక్‌లు, విపరీతమైన అవినీతి కారణంగా నాలుగేళ్లుగా పలు విభాగాల్లో నియామకాలు ఆలస్యమయ్యాయి. అలాగే ప్రభుత్వ శాఖల్లో 65శాతం పోస్టులు 2019 నుంచి ఖాళీగా ఉన్నాయి. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం’ అని పేర్కొన్నారు. కశ్మీర్‌లో 60,000 మందికి పైగా ప్రభుత్వ దినసరి కూలీలుగా 15 ఏళ్ల నుంచి శ్రమిస్తున్నారని, వారు రోజుకు రూ.300 మాత్రమే సంపాదిస్తున్నారని తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ పెద్ద తయారీ యూనిట్లు ఒక్కటి కూడా నెలకొల్పలేదని ఆరోపించారు. ప్రయివేటు రంగం, వ్యవసాయం, ఆతిథ్యం, ​​ఆరోగ్యం వంటి సేవలకే పరిమితమైందని వెల్లడించారు. 2021లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, కేవలం 3శాతం పెట్టుబడులు మాత్రమే కార్యరూపం దాల్చాయని గుర్తు చేశారు. ఇంకా 40శాతం ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కాబట్టి అక్టోబర్ 1న మోడీ అండ్ కంపెనీకి తలుపులు మూసివేసేందుకు యువత సిద్ధంగా ఉన్నారని నొక్కి చెప్పారు. కాగా, కశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story