మెజారిటీ సమాజానికి రామమందిరం అవసరమే: అయోధ్య ఆలయంపై ముస్లిం లీగ్ నాయకుడి ప్రశంసలు

by samatah |
మెజారిటీ సమాజానికి రామమందిరం అవసరమే: అయోధ్య ఆలయంపై ముస్లిం లీగ్ నాయకుడి ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ (ఐయూఎంఎల్) అధ్యక్షుడు సాదిక్ అలీ సాహిబ్ తంగల్ అయోధ్య రామాలయంపై ప్రశంసలు కురిపించారు. రామమందిరానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే బదులు లౌకిక వాదాన్ని స్వీకరించడం ముఖ్యమన్నారు. భారీ స్థాయిలో అయోధ్య రామాలయాన్ని నిర్మించడం మెజారిటీ సమాజానికి అవసరమని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ఆలయాన్ని కట్టారని.. బాబ్రీ మసీదు కూడా అంతే స్థాయిలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. ‘అనేక మంది ప్రజలు గౌరవించే రామమందిరం నిర్మించడం సరైందే. ఇది మెజారిటీ సమాజానికి అవసరం. మేము దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. ‘ప్రతి ఒక్కరికీ వారి సొంత మత విశ్వాసాలు, ఆచారాలు ఉంటాయి. అంతేగాక వాటిని అనుసరించే హక్కు కూడా ఉంది. కోర్టు తీర్పు తర్వాత నిర్మించిన ఆలయం, త్వరలో నిర్మించబోయే బాబ్రీ మసీదు రెండూ భారతదేశంలో భాగమే’ అని వెల్లడించారు. భారతీయ ముస్లింలు బాబ్రీ మసీదు నిరసనలను ఎంతో ఓపికతో నిర్వహించారని తెలిపారు. కేరళలోని ముస్లింలు మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మరోవైపు సాదిక్ అలీ ప్రకటనపై కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ స్పందించారు. సాదిక్ ఇరు వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని కొనియాడారు. రాష్ట్రంలో వివిధ మతాల మధ్య శాంతియుత సహజీవనం అవసరమని తెలిపారు. అలీ ప్రకటనను అభినందిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed