ఉద్ధవ్, కేజ్రీవాల్ భేటీ వెనుక అసలు రీజన్ ఇదేనా..? సంచలనం రేపుతోన్న ఆశిష్ షెలార్ ట్వీట్

by Satheesh |
ఉద్ధవ్, కేజ్రీవాల్ భేటీ వెనుక అసలు రీజన్ ఇదేనా..? సంచలనం రేపుతోన్న ఆశిష్ షెలార్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల మధ్య సయోధ్య అస్పష్టంగా ఉన్నప్పటికీ 2024 ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవిద్ కేజ్రీవాల్ తన పార్టీ నేతలతో కలిసి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కలవడం ఆసక్తిగా మారింది. అనూహ్యంగా జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే వీరిద్దరి భేటీపై ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కేజ్రీవాల్, ఉద్ధవ్ భేటీ వెనుక అసలైన రీజన్ ఇదే అంటూ ఆశిష్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.

ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో కేజ్రీవాల్ కుడి భుజంగా పేరు గాంచిన ఢిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీకి పదవిలో ఉన్నప్పుడు ఉద్ధవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లింక్ ఉందని ఆశిష్ అనుమానం వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్ సర్కార్ మద్యం కుంభకోణంలో మునిగితేలుతున్నప్పుడు అదే సమయంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం మహారాష్ట్రలో మద్యం మాఫియాతో టచ్‌లో ఉందని ఆరోపించారు. అందువల్లే థాక్రే ప్రభుత్వం మద్యం విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుందని.. విదేశీ మద్యంపై పన్ను మినహాయింపు ఇచ్చిందన్నారు. బార్ లైసెన్స్ ఫీజును తగ్గింపు, కిరాణా షాపుల్లో మద్యం విక్రయానికి కూడా అనుమతి ఇచ్చిందని ట్వీట్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీబీఐ మహారాష్ట్రలో ఉద్ధవ్ ప్రభుత్వం మద్యం విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఎంక్వయిరీ చేస్తుందా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎక్సైజ్ పాలసీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో మహారాష్ట్రలో మద్యం రాయితీల ఫైల్ తెరవబోతోందా? అందుకోసమే అరవింద్ కేజ్రీవాల్ ఉద్ధవ్ థాక్రే వద్దకు వచ్చారా? అంటూ ఆశిష్ ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ నెల 24వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ ముంబై వెళ్లారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీలు రాఘవ్ చద్దా మరియు సంజయ్ సింగ్‌తో కలిసి థాక్రే నివాసానికి వెళ్లారు. అక్కడ వీరు సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించామని అన్నారు. గత మూడేళ్లుగా ఉద్ధవ్‌ను కలవాలనుకుంటునప్పటికీ కోవిడ్ కారణాల వల్ల కలవలేకపోయానని చెప్పారు.

అదానీ హిండెన్‌బర్గ్ నివేదిక అనంతర పరిణామాలతో లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా నష్టాలపాలైందని కేజ్రీవాల్ ఆరోపించారు. శివసేన పార్టీ పేరును, గుర్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే వర్గం లాక్కుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇరు పార్టీల నేతలు ఇది క్యాజువల్ మీటింగే అని చెబుతుంటే.. బీజేపీ మాత్రం వీరి భేటీ వెనుక పక్కా వ్యూహం ఉందని, లిక్కర్ పాలసీ వ్యవహారాల కోసమే ఈ భేటీ జరిగిందని ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు దుమారంగా మారుతోంది.

Advertisement

Next Story

Most Viewed