లోక్ సభఎన్నికల పోలింగ్.. బెంగాల్ లో బీజేపీ,టీఎంసీ మధ్య ఘర్షణ

by Dishanational6 |
లోక్ సభఎన్నికల పోలింగ్.. బెంగాల్ లో బీజేపీ,టీఎంసీ మధ్య ఘర్షణ
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేళ మరోసారి హింస జరిగింది. కూచ్ బెహార్ లో ఘర్షణలు చెలరేగినట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. బేజపీ, టీఎంసీ పరస్పరం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాయి. కూచ్ బెహార్ పట్టణానికి సమీపంలోని చాంద్‌మారి దగ్గర టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్లు వార్తలు వచ్చాయి.

భేటగురి దగ్గర జరిగిన పెట్రో బాంబు దాడిలో టీఎంసీ కార్యకర్త అనంత్ బర్మాన్ గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బర్మాన్ ను పరామర్శించారు బెంగాల్ మంత్రి ఉదయన్ గుహా. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలింగ్ బూత్‌లకు రాకుండా అడ్డుకున్నారని, బూత్ ఏజెంట్లపై దాడి చేశారని టీఎంసీ, బీజేపీ నేతలు పర్సపం ఆరోపణలు చేసుకున్నాయి. కూచ్ బెహార్‌లోని తూఫాన్‌గంజ్, జల్‌పైగురిలోని దబ్‌గ్రామ్-ఫుల్‌బరీ వంటి ప్రాంతాల్లో తాత్కాలిక ఎన్నికల కార్యాలయాలకు నిప్పంటించారు. కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్, రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహా మద్దతుదారుల మధ్య కూడా ఘర్షణలు జరిగినట్లు సమాచారం.

ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. హింస, బెదిరింపులకు సంబంధించిన ఫిర్యాదులు కూచ్ బెహార్ నుంచి అధికంగా అందుతున్నాయని తెలిపారు. 2021 ఏప్రిల్‌లో కూచ్ బెహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. ఆ హింసలో ఐదుగురు చనిపోయారు. ఇకపోతే, ఎన్నికల హింసాత్మక ఫిర్యాదుల కోసం కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కోల్‌కతా నుంచి ఓటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారని టీఎంసీ కార్యకర్తలు తెలిపారు.

హింసాత్మక ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద్ బోస్ స్పందించారు. శాంతి, సామరస్యాలను బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హింసకు పాల్పడే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం తొలి దశ ఎన్నికలు జరుగుతుండగా, 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story

Most Viewed