Lobin Hembrom: జేఎంఎంకు మరో భారీ షాక్.. బీజేపీలో చేరిన సీనియర్ నేత

by vinod kumar |
Lobin Hembrom: జేఎంఎంకు మరో భారీ షాక్.. బీజేపీలో చేరిన సీనియర్ నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత లోబిన్ హెంబ్రామ్ శనివారం బీజేపీలో చేరారు. రాంచీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిస్వ శర్మ సమక్షంలో హేంబ్రామ్‌కు బీజేపీ రాష్ట్ర చీఫ్ బాబులాల్ మరాండీ సభ్యత్వం అందజేశారు. మాజీ సీఎం చంపై సోరెన్ కాషాయ గూటికి చేరిన మరుసటి రోజే హెంబ్రామ్ బీజేపీలో చేయడంతో జేఎంఎంకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. కాగా, హెంబ్రామ్ జార్ఖండ్ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. సంతాల్ పరగణాలో ప్రముఖ నాయకుడిగా ఉన్న ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బీజేపీలో జాయిన్ అయిన అనంతరం హెంబ్రామ్ మాట్లాడుతూ.. జేఎంఎం పూర్తిగా మారిపోయిందని పార్టీలో సీనియర్ నేతలకు ప్రస్తుతం గౌరవం లేదని తెలిపారు. జార్ఖండ్ అభివృద్ధి, గిరిజనుల అభ్యున్నతి కోసం కాషాయపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమంలో భాగమైన నేతలంతా ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని, బంగ్లాదేశ్ చొరబాటుదారుల నుండి విముక్తి పొందాలని బీజేపీ కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు. చొరబాటుదారులకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న ఉద్యమంలో హేమంత్ సోరెన్ కూడా చేరాలని, బుజ్జగింపు రాజకీయాలను విడిచిపెట్టాలని సూచించారు.

జార్ఖండ్ బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండీ మాట్లాడుతూ.. జేఎంఎంను తమ రక్తం, చెమటతో పోషించిన నాయకులు పార్టీని వీడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీలతో సంబంధం లేనట్టు జేఎంఎం వ్యవహరిస్తుందని ఆరోపించారు. మరికొంత మంది నేతలు సైతం త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న జార్ఖండ్‌లో సీనియర్ నేతలు పార్టీలు మారడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story