Liquor Tragedy: కళ్లుకురిచి కల్తీ మద్యం ఘటన.. సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

by vinod kumar |
Liquor Tragedy: కళ్లుకురిచి కల్తీ మద్యం ఘటన.. సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది జూన్‌లో తమిళనాడు (Thamilnadi)లోని కళ్లుకురిచి జిల్లాలో కల్లీ మద్యం తాగి 68 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు(Madras Hign court) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)తో విచారణ చేపట్టాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా కేసుకు సంబంధించిన మొత్తం అంశాలను సీబీఐకి అప్పగించాలని తెలిపింది. విషాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి అతి త్వరగా నివేదిక అందజేయాలని సీబీఐకి సూచించింది. అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నేత ఐఎస్ ఇనబదురై, బీజేపీ నేత మోహన్ దాస్, పట్టాలి మక్కల్ కట్చి (PMK) నాయకుడు కేకే బాలులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై జస్టిస్ డీ కృష్ణకుమార్, పీబీ బాలాజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనివల్ల కల్తీ మద్యం సరఫరా అవుతోందని పిటిషనర్లు వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. కల్తీ మద్యం వల్ల కలిగే ప్రమాదాలకు కళ్లుకురిచి ఘటన ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించింది. అయితే మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి క్రైమ్ బ్రాంచ్ విభాగానికి బదిలీ చేశామని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 24 మందిని అరెస్టు చేశారని, కలెక్టర్‌ను సైతం బదిలీ చేశారని, ఎస్పీని సస్పెండ్ చేశామని తెలిపింది. సీబీఐ విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని డీఎంకే అధికార ప్రతినిధి కాన్ స్టాంటైన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed