ED raids MUDA office: ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు

by Shamantha N |   ( Updated:2024-10-18 09:57:19.0  )
ED raids MUDA office: ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో (Karnataka) మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం (MUDA scam) కేసులో కీలక పరిణామం జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముడా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. కమిషనర్ రఘునందన్‌, ఇతర సిబ్బందితో ఈడీ అధికారులు మాట్లాడారు. ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని అందర్నీ విచారించనున్నారు. అలాగే పలు సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలాఉంటే.. రెండురోజుల క్రితం ముడా అథారిటీ ఛైర్మన్‌ కె.మరిగౌడ (K Marigowda) రాజీనామా చేశారు. మరిగౌడ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడని పేరుంది. అయితే.. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఆయన కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా..అనారోగ్యం కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ముడా స్కాం

కాగా.. ముడా స్కాం కన్నడ నాట రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై (Siddaramaiah) విచారణ కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు మరిగౌడ ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సిద్ధరామయ్యపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన సతీమణి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసినా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

Next Story