Kuki-Zo bodies: ప్రత్యేక కుకీలాండ్‌ ఏర్పాటు చేయాలి.. మణిపూర్‌లో కుకీ-జో సంస్థల భారీ నిరసన

by vinod kumar |
Kuki-Zo bodies: ప్రత్యేక కుకీలాండ్‌ ఏర్పాటు చేయాలి.. మణిపూర్‌లో కుకీ-జో సంస్థల భారీ నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో ప్రత్యేక కుకీలాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కుకీ-జో కమ్యునిటీ సభ్యులు శనివారం భారీ నిరసన తెలిపారు. చురాచంద్‌పూర్, కాంగ్‌పోక్పి తెంగ్నౌపాల్‌ జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. చురాచంద్‌పూర్‌ లీషాంగ్‌లోని ఆంగ్లో కుకి వార్ గేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆరుకిలోమీర్ల వరకు కొనసాగి టుయ్‌బౌంగ్‌లోని శాంతి మైదానంలో ముగిసింది. పుదుచ్చేరి తరహాలో శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇదొక్కటే రాష్ట్రాన్ని వివాదం నుంచి బయటపడేసే మార్గమని తెలిపారు. జోమీ స్టూడెంట్స్ ఫెడరేషన్, కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌తో సహా వివిధ సంఘాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మూడు జిల్లా్ల్లో అన్ని మార్కెట్లు, పాఠశాలలను మూసివేశారు.

ఈ సందర్భంగా కుకీ జో కమ్యునిటీనేత కిప్‌జెన్ మాట్లాడుతూ కుకీ జో ప్రజలకు కేంద్రపాలిత ప్రాంతం కావాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ప్రదర్శనలు చేపట్టామని తెలిపారు. కుకీ జో తెగలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వైరల్ ఆడియో క్లిప్‌లపై కూడా నిరసన చేపట్టినట్టు వెల్లడిచారు. మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ఇటీవల మాట్లాడుతూ.. కుకీ గ్రూపుల డిమాండ్‌ను తిరస్కరించారు. రాష్ట్ర గుర్తింపును నిర్వీర్యం చేయనివ్వబోమని తెలిపారు. కుకీలు నివసించే ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అందజేస్తామని చెప్పారు. అంతేగాక బిరేన్ సింగ్ వాయిస్ తో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో జాతి హింసపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కుకీ జో ప్రజలు నిరసన తెలిపారు. అయితే ఈ ఆడియో క్లిప్‌లో సీఎం వాయిస్‌ని తారుమారు చేశారని ప్రభుత్వం చెబుతోంది.

కాగా, ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అలాగే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌లలో కుకీ ప్రజలు ఒక జాతి సమూహంగా ఉన్నారు. పలు చోట్ల గిరిజనుల పై కొనసాగుతున్న హింసాకాండ ఫలితంగా వీరు ప్రత్యేక కుకీలాండ్‌ను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం లేదా పుదుచ్చేరి తరహాలో కేంద్రం పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని కుకీ ఎమ్మెల్యేలు సైతం ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపారు.

Advertisement

Next Story