Kolkata rape case: బీజేపీ నేతకు, ఇద్దరు డాక్టర్లకు సమన్లు

by Shamantha N |
Kolkata rape case: బీజేపీ నేతకు, ఇద్దరు డాక్టర్లకు సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా అత్యాచారం, హత్య ఘటనలో మరో కీలక పరిణామం జరిగింది. మృతురాలి గుర్తింపుని బయటపెట్టారని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపై పలువురికి కోల్ కతా పోలీసులు నోటీసులు అందజేశారు. బీజేపీ నేత సహా ఇద్దరు ప్రముఖ వైద్యులకు సమన్లు అందజేశారు. ట్రైనీ డాక్టర్ ఐడెంటిటీ బయటపెట్టారని, తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేశారని డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి సహా బీజేపీ నేత, మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీకి సమన్లు అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోగా లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హాజరుకావాలని ఆదేశించారు.

తప్పుడు సమాచారం వ్యాప్తి

కేసు దర్యాప్తు, పోస్టుమార్టం నివేదికకు సంబంధించి డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా డాక్టర్ సుబర్ణ గోస్వామి, గ్యాంగ్ రేప్‌ను సూచిస్తూ 150 మిల్లీగ్రాముల వీర్యం సహా దిగ్భ్రాంతికరమైన వివరాలు ఉన్న పోస్టుమార్టం నివేదిక తనకు అందుబాటులో ఉందని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే, కోల్‌కతా పోలీసులు మాత్రం ఇవన్నీ నిరాధారమైనవని, హానికరమైన పుకార్లు అని ఆ వ్యాఖ్యలను ఖండించారు. అత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై బీజేపీనేతకు, డాక్టర్కు సమన్లు అందాయి. ఇది తీవ్రమైన ఉల్లంఘన అని.. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వల్ల కొనసాగుతున్న దర్యాప్తును మరింత క్లిష్టతరం చేశారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే, విచారణకు వీరంతా హాజరుకావాల్సి ఉండగా.. లాల్ బజార్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కోల్ కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్ లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగింది. ఈ కేసుని కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. మరోవైపు, ఈ హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) 24 గంటలపాటు దేశవ్యాప్తంగా సమ్మే చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed