Supreme Court : జూనియర్ వైద్యురాలి కేసును సుమోటోగా స్వీకరించాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్లు

by Hajipasha |
Supreme Court : జూనియర్ వైద్యురాలి కేసును సుమోటోగా స్వీకరించాలి..   సుప్రీంకోర్టులో పిటిషన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. తాజాగా శుక్రవారం సుప్రీంకోర్టులో రెండు లెటర్ పిటిషన్లు దాఖలయ్యాయి. దారుణ స్థితిలో ప్రాణాలు విడిచిన జూనియర్ వైద్యురాలి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని పిటిషనర్లు కోరారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లు ఉజ్వల్ గౌర్, రోహిత్ పాండే ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లెటర్ పిటిషన్ పంపారు. ‘‘కోల్‌కతా ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత యావత్ దేశం ఇప్పుడు సుప్రీంకోర్టు వైపే ఆశగా చూస్తోంది. బాధిత జూనియర్ వైద్యురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశాభావంలో దేశ ప్రజలు ఉన్నారు. అందుకే ఈ కేసుపై సుప్రీంకోర్టు స్పందించాలి’’ అని పిటిషనర్లు కోరారు.

తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఉన్న ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌‌కు చెందిన డాక్టర్ మోనికా సింగ్ తన న్యాయవాది సత్యం సింగ్ ద్వారా సుప్రీంకోర్టులో ఒక లెటర్ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఈ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా స్పందించాలి’’ అని ఆమె కోరారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని డాక్టర్ల భద్రత కోసం అక్కడ కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలన్నారు.

Advertisement

Next Story