కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జులు

by John Kora |
కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జులు
X

- భారీగా మార్పులు చేసిన ఏఐసీసీ

- తెలంగాణకు మీనాక్షీ నటరాజన్

- దీపాదాస్ మున్షీ కేరళకు పరిమితం

- పంజాబ్ ఇంచార్జిగా భూపేష్ భాగేల్

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది. పలు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జులు, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, కేరళకు దీపాదాస్ మున్షి ఇంచార్జిగా వ్యవహరిస్తుండగా.. ఆమెను కేరళకు మాత్రమే పరిమితం చేశారు. తెలంగాణకు మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ మీనాక్షీ నటరాజన్‌ను ఇంచార్జిగా నియమించారు. మధ్యప్రదేశ్‌లోపా మందసౌర్ నుంచి 2009లో ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కోర్ టీమ్‌లో కీలక సభ్యురాలిగా ఉన్నారు.

ఇక ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్‌ను పంజాబ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇంచార్జిగా నియమించారు. జమ్ము కశ్మీర్, లద్దాక్ జనరల్ సెక్రటరీ ఇంచార్జిగా డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షుడి కార్యాలయంలో ఉన్న బాధ్యతల నుంచి తప్పించారు. ఇక హిమాచల్ ప్రదేశ్, చంఢీఘర్ ఇంచార్జిగా రజనీ పాటిల్, హర్యానా ఇంచార్జిగా బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్ ఇంచార్జిగా హరీశ్ చౌదరి, తమిళనాడు, పుదుచ్చెరి ఇంచార్జిగా గిరీశ్ చోడన్కర్, ఒడిషా ఇంచార్జిగా అజయ్ కుమార్ లల్లూ, జార్ఖండ్ ఇంచార్జిగా కొప్పుల రాజు, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ ఇంచార్జిగా సప్తగిరి శంకర్ ఉలాకా, బీహార్ ఇంచార్జిగా క్రిష్ణ అల్లవారును నియమించారు. బీహార్‌లో ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో క్రిష్ణ అల్లావారుకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇక ఇప్పటి వరకు జనరల్ సెక్రటరీలుగా, ఇంచార్జులుగా పని చేసి.. బాధ్యతల నుంచి తప్పుకుంటున్న దీపక్ బాబ్రియా, మోహన్ ప్రకాశ్, భరతసిన్హ్ సోలంకి, రాజీవ్ శుక్లా, అజయ్ కుమార్, దేవేంద్ర యాదవ్‌లకు పార్టీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తర్వాత వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేక పోయింది. ఢిల్లీలో వరుసగా మూడో సారి ఖాతా తెరవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Next Story