కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు కేరళ రూ. 5 లక్షల పరిహారం

by S Gopi |
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు కేరళ రూ. 5 లక్షల పరిహారం
X

దిశ, నేషనల్ బ్యూరో: కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనలో దుర్మరణం పాలైన కేరళ పౌరుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అత్యవసర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనలో కేరళకు చెందిన 19 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా గాయపడిన వారికి చికిత్స, మరణించిన వారి మృతదేహాలను తిరిగి స్వంత దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ను తక్షణం కువైట్‌కు పంపనున్నట్టు సమాచారం. కాగా, అగ్ని ప్రమాదంలో మరణించిన కేరళీయులకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు అందజేస్తామని ప్రముఖ వ్యాపారవేత్త ఎమే యూసఫ్ అలీ, మరో వ్యాపారవేత్త రవి పిళ్లై రూ. 2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed