డీకే శివకుమార్ చేతబడి వ్యాఖ్యలపై స్పందించిన కేరళ

by Harish |
డీకే శివకుమార్ చేతబడి వ్యాఖ్యలపై స్పందించిన కేరళ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తనను, సీఎం సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేరళలో ఒక ఆలయంలో చేతబడి పూజలు చేస్తున్నారని ఆరోపించగా, తాజాగా ఈ వ్యాఖ్యలపై శనివారం కేరళ ప్రభుత్వం స్పందించింది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని దేవాలయానికి సమీపంలో ఎటువంటి జంతుబలి జరగలేదని స్పష్టం చేశారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. మేము దీనిపై పూర్తి విచారణ చేశాం, మాకు లభించిన ప్రాథమిక నివేదికలో రాష్ట్రంలో కానీ లేదా ఆలయ సమీపంలో జంతుబలి జరిగినట్లు ఆధారాలు లభించలేదు. మలబార్ దేవస్థాన బోర్డును కూడా సంప్రదించాం, వారు కూడా అక్కడ ఎలాంటి జంతుబలి జరగలేదని ధృవీకరించారు. శివకుమార్ ఎందుకు ఇలాంటి ఆరోపణ చేశారో పరిశీలించాల్సి ఉందన్నారు.

డిప్యూటీ సీఎం ఆరోపించినట్లుగా కేరళలో ఎక్కడైనా జరిగిందా అనే దానిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, ప్రాథమిక నివేదికల ప్రకారం రాష్ట్రంలో అలాంటి సంఘటన జరగలేదని రాధాకృష్ణన్ చెప్పారు. కేరళలో జంతు బలిపై 1968 నుండి చట్టం పరంగా నిషేధం అమల్లో ఉంది, కాబట్టి ఇలాంటి సంఘటనలు కేరళలో జరిగే అవకాశం లేదని కూడా ఆయన అన్నారు. జంతుబలి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ స్పెషల్ బ్రాంచ్ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నివేదిక కూడా ఇచ్చిందని కేరళ రాష్ట్ర మంత్రి తెలిపారు.

శివకుమార్ ఆరోపణలను ఆలయ మేనేజింగ్ కమిటీ శుక్రవారం ఖండించింది, ఆయన వాదనలు 100 శాతం అబద్ధమని పేర్కొంది. అంతకుముందు తనను, సిద్ధరామయ్యను, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కేరళలోని ఒక దేవాలయంలో జంతువులను బలి ఇచ్చే "శత్రు భైరవి యాగ" అనే పూజ జరిగిందని శివకుమార్ గురువారం పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed