కేరళలో అరుదైన మెదడు ఇన్ఫెక్షన్‌తో మరో బాలుడు మృతి.. 3 నెలల్లో మూడో మరణం

by S Gopi |
కేరళలో అరుదైన మెదడు ఇన్ఫెక్షన్‌తో మరో బాలుడు మృతి.. 3 నెలల్లో మూడో మరణం
X

దిశ, నేషనల్ బ్యూరో: అత్యంత అరుదైన మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా కేరళలో మరో బాలుడు మృతి చెందాడు. కోజీకోడ్‌లో కలుషితమైన చెరువులో స్నానం చేస్తున్న సమయంలో బాలుడు దానికి కాంటాక్ట్ అయినట్టు వైద్యులు తెలిపారు. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో చికిత్స పొందుతూ 14 ఏళ్ల ఆ బాలుడు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. జూలై 3 రాత్రి 11 గంటలకు బాలుడు మృతి చెందినట్టు గురువారం కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన మూడు నెలల కాలంలో ఇది మూడో మరణం. గతంలో మే 21న మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక ఇదే ఇన్ఫెక్షన్‌తో మృతి చెందగా, జూన్ 25న కన్నూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు ఇదే వ్యాధితో మరణించిన రెండు కేసులు నమోదయ్యాయి. తాజా కేసుకు సంబంధించి జూన్ 24న ఇన్ఫెక్షన్ సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇటీవలే ఆరోగ్య శాఖ వర్గాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇన్ఫెక్షన్ వ్యాధికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు.

అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌ అంటే..

అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనేది స్వేచ్చగా జీవించే ఏకకణ జీవి. ఇది నెగ్లేరియా ఫౌలెరీ అమీబా వల్ల కలిగే అరుదైన, ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్. ఈ అమీబా సాధారణంగా కలుషితమైన నీటి నుంచి మనుషులకు సోకుతుంది. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, ఆపై మెదడుకు చేరుతుంది. అక్కడ అది నరాల కణజాలంపై ఆధారపడి ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. అయితే, ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి సోకదని వైద్యులు వెల్లడించారు.

ఇన్ఫెక్షన్ లక్షణాలు..

ఈ ఇన్ఫెక్షన్ సోకిన సమయంలో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు అవుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ మెడ బిగుసుకుపోవడం, కలవరపాటు, మూర్చ, బ్రాంతి, కోమా వంటి లక్షణాలు కనిపించవచ్చని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు సాధారణంగా కలుషితమైన నీటి బారిన పడిన 1 నుంచి 12 రోజులలోపు మొదలవుతుందని, ఆ తర్వాత వేగంగా పురోగతి చెంది, లక్షణాలు కనిపించిన 5-18 రోజులలోపు ఇన్ఫెక్షన్ ప్రాణాంతకమవుతుందని వైద్యులు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed