Kc thyagi: జేడీయూకు షాక్.. జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి రాజీనామా

by vinod kumar |
Kc thyagi: జేడీయూకు షాక్.. జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) జాతీయ అధికార ప్రతినిధి పదవికి కేసీ త్యాగి ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్‌కు లేఖ రాశారు. ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల పదవికి న్యాయం చేయలేకపోతున్నానని, కాబట్టి ఈ బాధ్యత నుంచి తప్పించాలని పేర్కొన్నారు. బిహార్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని తెలిపారు. జేడీయూ ప్రధాన కార్యదర్శి అఫాక్‌ అహ్మద్‌ ఖాన్‌ సైతం త్యాగి రాజీనామాను ధ్రువీకరించారు. ఆయన స్థానంలో రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను నూతన జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. త్యాగి వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకున్నట్టు వెల్లడించారు.

జేడీయూ సీనియర్ నేత అయిన త్యాగి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అయితే త్యాగి ఇటీవల జేడీయూ నాయకత్వాన్ని సంప్రదించకుండా పలు ప్రకటనలు చేశారు. గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారత్ మద్దతిస్తుందని పేర్కొంటూ ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. ఇదేగాక అగ్నిపథ్ పథకంపైనా పునరాలోచించాలని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన ప్రకటనలు పార్టీ వైఖరికి భిన్నంగా ఉన్నాయని పేర్కొంటూ పలువురు పార్టీ నేతలు త్యాగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story