Article 370: 'ఆర్టికల్ 370 రద్దును సమర్ధించండి'.. సుప్రీం కోర్టును కోరిన కశ్మీరీ పండిట్ల సంఘం

by Vinod kumar |
Article 370: ఆర్టికల్ 370 రద్దును సమర్ధించండి.. సుప్రీం కోర్టును కోరిన కశ్మీరీ పండిట్ల సంఘం
X

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కశ్మీరీ హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘యూత్ 4 పనున్ కశ్మీర్’ అనే సంస్థ సమర్ధించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం 2019లో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ ‘యూత్ 4 పనున్ కశ్మీర్’ సంస్థ గురువారం సుప్రీం కోర్టులో ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసింది.

ఆర్టికల్ 370, 35ఏ వల్లే భారత దేశంలోని ఇతర రాష్ట్రాలతో జమ్మూకశ్మీర్ మిళితం కాలేకపోయిందని, జాతి ప్రక్షాళన పేరుతో అమాయక కశ్మీరీ పండిట్‌లపై దాడులు చేసి రాష్ట్రం నుంచి తరిమికొట్టే వేర్పాటువాద శక్తులకు ఊతం లభించిందని ఆ అప్లికేషన్‌లో వివరించింది. కశ్మీరీ పండిట్‌లపై జరిగిన ఆకృత్యాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియాపరత్వాన్ని గుర్తించాలని న్యాయవాది సిద్ధార్థ్ ప్రవీణ్ ఆచార్య దాఖలు చేసిన దరఖాస్తులో సుప్రీం కోర్టును కోరారు.

ఆర్టికల్ 370 కశ్మీరీ పండిట్‌ల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, ఆ నిబంధన ప్రకారం.. రాష్ట్రం బయటి వారిని పెళ్లి చేసుకున్న వాళ్లు జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాస ప్రయోజనాలను కోల్పోతారని వాదించారు. జమ్మూకశ్మీర్‌కు వర్తించే రణబీర్ శిక్షాస్మృతి ప్రకారం రాష్ట్రంలో తుపాకుల వాడకం, సామూహిక శిక్షణలకు అనుమతి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదని, రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉందని నొక్కి చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 20కి పైగా పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2వ తేదీ నుంచి రోజువారీగా (సోమ, శుక్రవారాల్లో మినహా) విచారించనుంది.

Advertisement

Next Story