చైనా వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్

by Harish |   ( Updated:2024-06-06 14:56:42.0  )
చైనా వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా వీసా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కొడుకు కార్తీ చిదంబరానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. 2011లో ఆయన తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు 263 మంది చైనా పౌరులకు వీసాలు ఇప్పించేందుకు రూ.50 లక్షల లంచం తీసుకున్నట్లు కార్తీ చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్చిలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం సమన్లు జారీ చేసి, రూ. లక్ష విలువైన రెండు వ్యక్తిగత బాండ్లను సమర్పించాలని సూచించగా, తాజాగా దీనికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, దర్యాప్తుకు సహకరించాలని, విదేశాల్లో ఉంటే దర్యాప్తు సంస్థ పిలిచిన 48 గంటల్లోపు హాజరు కావాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే కార్తీ చిదంబరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని శివగంగ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జూన్ 4న వెలువడిన ఓట్ల లెక్కింపులో కార్తీ చిదంబరం 4,27,677 ఓట్లతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన తర్వాత మాట్లాడిన ఆయన తమిళనాడు ప్రజలు బీజేపీ హిందుత్వ రాజకీయాలను తిరస్కరించి, సమాఖ్యకు ఓటేశారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed