Kanhaiya Lal murder: టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసు.. నిందితుడికి బెయిల్ మంజూరు

by vinod kumar |
Kanhaiya Lal murder: టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసు.. నిందితుడికి బెయిల్ మంజూరు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో 2022లో టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన మహ్మద్ జావేద్‌కు రాజస్థాన్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఐఏ కేవలం ఫోన్ కాల్ ఆధారంగా మాత్రమే నిందితులను అరెస్టు చేసిందని కోర్టు తెలిపింది. అంతేగాక నిందితుడి నుంచి ఎలాంటి రికవరీ జరగలేదని పేర్కొంది. కాబట్టి ఎక్కువ కాలం విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. 11 మంది నిందితుల్లో జావేద్ మహ్మద్ రియాజ్ అత్తారీతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

కాగా, 2022లో మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కన్హయ్య లాల్ మద్దతిచ్చారు. దీంతో అతని దుకాణంలోనే రియాజ్ అత్తారీ, మహ్మద్ గౌస్ అనే నిందితులు తలనరికి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోటీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య చేయడాని కన్నా ముందు కన్హయ్య లాల్ టైలర్ షాప్‌లోనే ఉన్నట్టు జావేద్ సమాచారం ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఎన్ఐఏ ఆయనను అరెస్టు చేసింది. గతంలో ఎన్‌ఐఏ కోర్టు బెయిల్‌ను తిరస్కరించడంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించగా తాజాగా బెయిల్ లభించింది.

Advertisement

Next Story

Most Viewed