Joe Biden: కుమారుడికి క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్

by Shamantha N |
Joe Biden: కుమారుడికి  క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన కుమారుడి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవిని వీడనున్న బైడెన్.. తన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు క్రిమినల్ కేసుల నుంచి ఉపశమనం కల్పించారు. అక్రమ ఆయుధ కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటన చేశారు. తన కుమారుడిపై ఉన్న కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఈసందర్భంగా జో బైడెన్‌ (Joe Biden) ఆరోపించారు. ‘‘అమెరికా ప్రజలకు తెలియాల్సిన నిజం ఉంది. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే చెప్పా. నా జీవితం మొత్తంలో నేను పాటిస్తున్న సూత్రం ఇదే. ఇచ్చిన ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నా కుమారుడు హంటర్‌ (Hunter Biden)ను అన్యాయంగా విచారిస్తున్నప్పటికీ చూస్తూ ఉండిపోయా. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు. ఇక జరిగింది చాలు. ఈ కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నా. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. హంటర్‌ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్న బైడెన్‌ (Joe Biden).. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇకపోతే, అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్.. బైడెన్ నిర్ణయంపై ఫైర్ అయ్యారు. బైడెన్ అధికార దుర్వినియోగానికి, న్యాయవ్యవస్థ పతనానికి కారణమయ్యారని ఫైర్ అయ్యారు.

హంటర్ పై కేసులు

2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. ఇక, కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. అక్రమ ఆయుధం కొనుగోలు వ్యవహారంలో హంటర్‌పై నమోదైన కేసులో ఈ ఏడాది జూన్‌లో న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. అయితే ఇప్పటివరకు శిక్ష ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో జో బైడెన్‌ స్పందిస్తూ.. తీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో కుమారుడి తరఫున క్షమాభిక్ష కోరబోనన్న బైడెన్.. ఇప్పుడు ఆ అవకాశాన్ని వాడుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed