Jammu kashmir: కశ్మీర్ రెండో దశలో 56 శాతం పోలింగ్.. అత్యధికంగా ఎక్కడంటే?

by vinod kumar |
Jammu kashmir: కశ్మీర్ రెండో దశలో 56 శాతం పోలింగ్.. అత్యధికంగా ఎక్కడంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు జిల్లాల్లోని 26 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగగా.. 56.05 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 4శాతం తక్కువ. 2014లో ఈ స్థానాల్లో 60 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసి జిల్లాలో 71.81శాతం ఓటింగ్ నమోదు కాగా.. శ్రీనగర్‌లో అత్యల్పంగా 27.37శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక, గందర్బల్‌లో 58.81శాతం, పూంచ్‌లో 71.59 శాతం, రాజౌరీలో 68.22శాతం, బుద్గాంలో 58.97 శాతం పోలింగ్ నమోదైంది.

కొన్ని బూత్‌లలో సాయంత్రం 6.45 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగిందని జమ్మూ కశ్మీర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు. అన్ని కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేదని వెల్లడించారు. ఎక్కడ కూడా రీ పోలింగ్ అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే యూఎస్, నార్వే, సింగపూర్‌ల ప్రతినిధులతో సహా 16 మంది విదేశీ దౌత్యవేత్తల బృందం కశ్మీర్‌లో పర్యటించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించింది. కాగా, మొత్తం మూడు దశల్లో జరగనున్న కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు గాను మొదటి దశ ఈ నెల 18న జరిగింది. చివరి విడత పోలింగ్ అక్టోబర్ 1న జరగనుంది.

Next Story

Most Viewed