మొదటి హాలో కక్ష్యను పూర్తిచేసిన ఆదిత్య-ఎల్1

by S Gopi |
మొదటి హాలో కక్ష్యను పూర్తిచేసిన ఆదిత్య-ఎల్1
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. సూర్యుడిపై అధ్యయనానికి రూపొందించిన ఆదిత్య-ఎల్1 మిషన్ నౌక తన మొదటి హాలో కక్ష్యను పూర్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఇస్రో ప్రకటనను విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్ మొదటివారంలో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 మిషన్ 2024, జనవరి 6న సూర్యుడు-భూమికి మధ్య సమస్థితి కక్ష్యలోకి ప్రవేశించింది. తాజాగా ఆ కక్ష్యను పూర్తి చేసేందుకు ఆదిత్య-ఎల్1కు 178 రోజులు పట్టింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు పంపిన ఈ అంతరిక్ష నౌక భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే లాగ్రాంజియన్ పాయింట్-1(ఎల్1) చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ ప్రదేశంలో సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు, భూమి చుట్టూ ఉండే పర్యావరణంపై ప్రభావం గురించి అధ్యయనం చేస్తుంది. ఈ కక్ష్యను కొనసాగించడానికి ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌక మూడు స్టేషన్ కీపింగ్ విన్యాసాలను నిర్వహించింది. అవి ఫిబ్రవరి 22, జూన్ 7, జూలై 2న. దీని తర్వాత రెండవ హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో తెలిపింది. ఈ విన్యాస ప్రక్రియ చేయకపోతే ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం సూర్యుడి దిశగా వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఆదిత్య-ఎల్1 మొదటి కక్ష్యలో ప్రయాణించే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటుందని, లాగ్రాంజియన్ పాయింట్‌లో ఉన్న వాతావరణం కారణంగా ఆదిత్య-ఎల్1 కక్ష్య మార్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఇస్రో పేర్కొంది. మంగళవారం నాటి ఆదిత్య-ఎల్1 పరిభ్రమణానికి ఇస్రో అధునాతన ఫ్లైట్ డైనమిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది.

Next Story

Most Viewed