Israel-Hamas: హమాస్, ఇజ్రాయెల్ ఖైదీల విడుదల

by Shamantha N |
Israel-Hamas: హమాస్, ఇజ్రాయెల్ ఖైదీల విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్, ఇజ్రాయెల్(Israel-Hamas) మధ్య ఖైదీల విడుదల క్రమంగా జరుగుతోంది. వారంరోజుల క్రితం తొలిదశ కాల్పుల విరమణ జరగగా.. శనివారం మరికొందరు ఖైదీల విడుదల జరిగింది. నలుగురు మహిళా బందీలను హమాస్ విడుదల చేయగా.. 70 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. హమాస్ నలుగురు మహిళా సైనికులను విడుదల చేసింది. ఆ నలుగురి పేర్లు కరీనా అరీవ్, డానియెల్‌ గిల్‌బోవా, నామా లెవి, లిరి అల్బాజ్‌. గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్‌ నుంచి వారిని 2023, అక్టోబర్ 7న హమాస్‌ బంధించి తీసుకెళ్లింది. 477 రోజులుగా వారు ఆ గ్రూప్ చెరలోనే మగ్గిపోయారు. తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చి, రెడ్‌క్రాస్‌కు అప్పగించగా.. వారిని ఇజ్రాయెల్‌కు తీసుకెళ్తున్న వాహనం గాజాను వీడిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

70 మంది పాలస్తీనియన్లు విడుదల

హమాస్ విడుదల చేసిన నలుగురు సైనికులకు ప్రతిగా 200 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టనున్నట్లు ఇజ్రాయల్ వెల్లడించింది. కాగా.. అందులో 70 మందిని విడుదల చేసింది. పాలస్తీనా ఖైదీలను గాజా స్ట్రిప్ సమీపంలోని రఫా సరిహద్దు క్రాసింగ్ దగ్గర ఈజిప్టు వైపు విడుదల చేశారు. గత వారాంతంలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో దశ ఖైదీల మార్పిడి. కాగా.. గాజాపై ఇజ్రాయెల్ ఆరువారల పాటు యుద్ధాన్ని నిలిపివేసింది. ఈ సమయంలో డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ బందీలు, వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారు. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్‌.. వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి హమాస్‌ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్‌ విముక్తి కల్పించనుంది.

Next Story