Israel: దాడుల గురించి ముందే తెలుసు- వైట్ హౌజ్ కీలక ప్రకటన

by Shamantha N |
Israel: దాడుల గురించి ముందే తెలుసు- వైట్ హౌజ్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas)ల యుద్ధం ముగిసేటట్టు కన్పించట్లేదు. ఓవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు జరుగుతండగానే టెల్ అవీవ్ వైమానిక దాడులు జరగడం గమనార్హం. గాజాపై(Gaza) ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో దాదాపు 200 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. అయితే, ఈ దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. కాగా.. ఈ విషయాన్ని యూఎస్ ధ్రువీకరించింది. ‘‘దాడుల గురించి ట్రంప్ యంత్రాంగాన్ని, వైట్‌హౌస్‌ను ఇజ్రాయెల్ సంప్రదించింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాను భయభ్రాంతులకు గురిచేయాలని చూసే హమాస్, హూతీలు, ఇరాన్ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పటికే ఇదే విషయాన్ని ట్రంప్ స్పష్టంచేశారు’’ అని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లివిట్‌ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని, బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని ఈ ఘటనపై హమాస్ ఆగ్రహం వ్యక్తంచేసింది.

హమాస్ కు ట్రంప్ వార్నింగ్

మరోవైపు, ఇటీవలే హమాస్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజా (Gaza)ను మరింత నాశనం చేస్తానని బెదిరించారు. నరకం చూపిస్తా అని హెచ్చరించారు. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోందన్నారు. హమాస్ మిలిటెంట్లు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికలను హమాస్ పట్టించుకోలేదు. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ట్రంప్‌, నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. రెండో దశపై చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. తాము విడుదల చేస్తోన్న బందీలకు బదులుగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలంది. ఈ తరుణంలో దాడులు జరగడం గమనార్హం. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించేందుకు హమాస్ అంగీకరించలేదని.. అందుకే దాడులు చేసినట్లు నెతన్యాహు తెలిపారు. ‘‘మా బందీలను విడుదల చేయడానికి హమాస్‌ పదేపదే నిరాకరిస్తోంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును కూడా తిరస్కరించింది. అంజుతే దాడులకు ఆదేశించాం. యుద్ధ లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ దాడులు చేస్తోంది’’ అని తెలిపారు. ఇకపోతే, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ (Hamas) దాడి చేయడంతో సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది.

Next Story

Most Viewed