ఇరాన్ అధ్యక్ష ఎన్నికల బరిలో మాజీ స్పీకర్ అలీ లారిజనీ..!

by Shamantha N |
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల బరిలో మాజీ స్పీకర్ అలీ లారిజనీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో మాజీ స్పీకర్ అలీ లారిజనీ నిలిచారు. ఇటీవలే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన మరణం తర్వాత.. తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా.. జూన్ 28న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు అలీ లారిజనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రయీసీకి గట్టిపోటీదారుడిగా ఈయనకు పేరుంది. మరోవైపు, తాత్కాలిక అధ్యక్షుడు మొహమ్మద్ మొఖ్బర్ ఎన్నికల రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈయనకు సుప్రీం లీడర్ ఖమేనీ మద్దతు కూడా ఉంది. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మదీనెజాద్, సంస్కరణవాది మొహమ్మద్ ఖతామీ కూడా ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల కోసం 12 మంది సభ్యుల గార్డియన్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఈ కౌన్సిల్ లో సుప్రీం లీడర్ ఖమేనీ, మతాధికారులు సభ్యులుగా ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మంగళవారంలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత పదిరోజుల్లోగా గార్డియన్ కౌన్సిల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంది. వారికి ఎన్నికలకు ముందు రెండు వారాలపాటు ప్రచారం చేసుకునేందుకు అనుమతి దొరుకుతుంది.

Advertisement

Next Story

Most Viewed