ఒమన్ వేదికగా అమెరికా, ఇరాన్ రహస్య చర్చలు.. దానిపైనే ప్రధాన డిస్కషన్

by Vinod kumar |   ( Updated:2023-06-12 17:06:35.0  )
ఒమన్ వేదికగా అమెరికా, ఇరాన్ రహస్య చర్చలు..  దానిపైనే ప్రధాన డిస్కషన్
X

తెహ్రాన్ (ఇరాన్) : అణు ఒప్పందానికి సంబంధించిన అంశంపై తమ దేశంతో అమెరికా చర్చలు జరిపిన విషయం వాస్తవమేనని ఇరాన్ అంగీకరించింది. మే 8న ఒమన్‌ దేశం కేంద్రంగా వైట్ హౌస్ మిడిల్ ఈస్ట్ కోఆర్డినేటర్ బ్రెట్ మెక్‌గుర్క్, ఇరాన్‌ అణు సంధానకర్త అలీ బఘేరి కాన్ మధ్య రహస్య చర్చలు జరిగాయని వెల్లడించింది. ఈ వివరాలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్ కనాని సోమవారం మీడియాకు వెల్లడించారు. తమ దేశంపై విధించిన ఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన అంశం ఈసందర్భంగా ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు. అయితే దానిపై రెండు దేశాల మధ్య సయోధ్య కుదరలేదని ఆయన తెలిపారు.

ముడి యురేనియంలో "యురేనియం 235" మూలకం 0.7 శాతం మాత్రమే ఉంటుంది. అణుబాంబులు తయారు చేయాలంటే ముడి యురేనియంలో దాని మోతాదును 3 శాతానికి పెంచాలి. ఈ ప్రక్రియనే యురేనియం ఎన్ రిచ్ మెంట్ అంటారు. ఈ ప్రక్రియను గనుక చేస్తే ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఈ చర్చల సందర్భంగా అమెరికా హెచ్చరించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరుదేశాల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన అంశంపైనా రహస్య మీటింగ్‌లో చర్చించినట్టు తెలుస్తోంది. డ్రోన్ ఫ్యాక్టరీని నిర్మించడానికి రష్యాకు ఇరాన్ పరికరాలను అందించిందనే ఆరోపణలను కూడా ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్ కనాని ఖండించారు.

Advertisement

Next Story