దేశంలో రెండో అంతరిక్ష కేంద్రం: తమిళనాడులో ప్రారంభించిన ప్రధాని మోడీ

by samatah |
దేశంలో రెండో అంతరిక్ష కేంద్రం: తమిళనాడులో ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో నిర్మించనున్న దేశంలోనే రెండో అంతరిక్ష కేంద్రానికి ప్రధాని మోడీ బుధవారం శంకుస్థాపన చేశారు. అంతేగాక రూ.17,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ హబ్ పోర్ట్ కూడా ఉంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు తమిళనాడును విస్మరించాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు దశాబ్దాల తరబడి డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టులను ప్రారంభించడం గర్వంగాఉందన్నారు. రాబోయే రోజుల్లో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త శక్తితో రాష్ట్రానికి తిరిగి వస్తానని చెప్పారు. మోడీ తమిళనాడు పర్యటన అనంతరం మహారాష్ట్రకు చేరుకోనున్నారు.

సెకండ్ స్పేస్ స్టేషన్ వివరాలు!

రెండో అంతరిక్ష కేంద్రం నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందని ఇస్రో చెబుతోంది. దీనికి రూ. 986కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న కులశేఖరపట్నంలోని రాకెట్ లాంచ్ ప్యాడ్ ఉపగ్రహాలను ఉంచేందుకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. దీనిని 2,350 ఎకరాలలో నిర్మిస్తుండగా.. 2022 జూలై నాటికి 1950 ఎకరాల భూసేకరణ పూర్తైంది. తమిళనాడు ప్రభుత్వం తూత్తుకుడి ప్రాంతంలో 961 హెక్టార్లకు పైగా కేటాయించిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో పార్లమెంటుకు తెలియజేశారు.కాగా, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో మాత్రమే అంతరిక్ష కేంద్రం ఉంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు 95 అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించారు. వాటిలో 80 విజయవంతమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed