Chandrayaan-3 launch in June next year: ISRO chairman

by srinivas |   ( Updated:2022-10-20 17:01:12.0  )
Chandrayaan-3 launch in June next year: ISRO chairman
X

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3కి పథకాలు రచిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పేర్కొంది. ఇది చంద్రుడిపై భారత్ తలపెడుతున్న 3వ యాత్ర అని పేర్కొంది. 2023 జూన్ నెలలో అత్యాధునికమైన లూనార్ రోవర్‌ని ఈ మిషన్‌లో భాగంగా తీసుకుపోనున్నట్లు చెప్పింది. అలాగే మానవ సహిత గగన్‌యాన్‌కి సంబంధించి తొలి టెస్టు ఫ్లైట్‌ని వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే ప్రయోగించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఢిల్లీలో గురువారం మీడియాతో ముచ్చటిస్తూ చంద్రయాన్, గగన్ యాన్‌కి సంబంధించిన వివరాలు పంచుకున్నారు. చంద్రయాన్-3లో భాగంగా తీసుకెళుతున్న లూనార్ రోవర్ భవిష్యత్తులో గ్రహాంతర యాత్రలకు కీలకమైనదని పేర్కొన్నారు. అలాగే గగన్ యాన్‌లో భాగంగా అబోర్ట్ మిషన్‌కి సంబంధించి తొలి టెస్ట్ ప్లైట్‌ని కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. (ఉపగ్రహ వాహక నౌక మధ్యలోనే విఫలమైతే రోదసి యాత్రికులను నౌక నుంచి క్షేమంగా బయటకు నెట్టివేసే సిస్టమ్‌ని అబోర్ట్ సిస్టమ్ అంటారు.)

అబోర్ట్ మిషన్ టెస్టులను ఆరుసార్లు విజయవంతంగా ముగిశాక 2024 చివరినాటికి భారత రోదసీయాత్రికులను భూకక్ష్యలో విహరించడానికి పథకాలు రచిస్తున్నామని తెలిపారు. 2019లో చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా పంపిన విక్రమ్ లాండర్ చివరి క్షణాల్లో చంద్రుడిపై కుప్పకూలి విఫలమైన తర్వాత చంద్రయాన్-3కి రంగం సిద్ధం చేస్తున్నామని ఇస్రో చీఫ్ తెలిపారు. అయితే ఇది చంద్రయాన్-2కి నకలు మాత్రం కాదని, అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యంతో కూడిన లూనార్ రోవర్‌ని సి-3లో భాగంగా ప్రయోగిస్తున్నామని చెప్పారు. దీనివల్ల సి-2లో ఎదురైన సమస్యలను అధిగమిస్తామన్నారు. మరో రెండు అబోర్ట్ మిషన్లు, ఒక మానవ రహిత మిషన్‌ని విజయవంతంగా పూర్తి చేశాక మానవసహిత గగన్ యాన్‌కి పూనుకోగలమని ఇస్రో చీఫ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed