Los Angeles: లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు.. 10 మంది మృతి

by Shamantha N |
Los Angeles:  లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు.. 10 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: లాస్ ఏంజిల్స్‌(Los Angeles)ను కార్చిచ్చు(wildfires) చుట్టుముట్టింది. ఈ ఘోర ప్రమాదంలో పది మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్‌ పాలిసాడ్స్‌ ప్రాంతాన్ని కార్చిచ్చు పూర్తిగా దగ్ధం చేసింది. ఈ విషయాన్ని ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం 9,000 నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. ఒక్క పాలిసాడ్స్‌లోనే 5,300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి. ఉడ్‌లాండ్‌ హిల్స్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్నిత్‌ కార్చిచ్చును అంటించినట్లు అనుమానించడంతో భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకొన్నాయి. పాలిసాడ్స్‌లో దాదాపు 20 వేల ఎకరాలు, ఈటొన్‌ ఫైర్‌ 13,600 ఎకరాలు, కెన్నెత్ ఫైర్‌, 791 ఎకరాలు, సన్‌సెట్‌ ఫైర్‌ 60 ఎకరాలు, హురస్ట్‌ ఫైర్‌ 855 ఎకరాలను అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే 1.80 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సహాయక చర్యల్లో 7500 మంది

అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయ సిబ్బందితో సహా 7,500 మందికి పైగా మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్నారు. కాలిఫోర్నియాలోనే 1,400 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నారు. ఒరెగాన్, వాషింగ్టన్, ఉతా, న్యూ మెక్సికో, అరిజోనా నుండి అదనపు బృందాలను పంపారుత అక్యూవెదర్‌ అంచనాల ప్రకారం నష్టం 150 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.12లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా వేసింది. కేవలం 24 గంటల్లోనే ఈ అంచనాలు మూడింతలు పెరగడం గమనార్హం. అమెరికాలోనే అత్యంత ఖరీదైన గృహాలు ఇక్కడ ఉండటమే ఇందుకు కారణమని ఆ సంస్థ ప్రధాన వాతావరణ శాస్త్రవేత్త జోనాథన్‌ పోర్టర్‌ తెలిపారు. తీవ్రమైన పెనుగాలుల కారణంగా మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో గాలులు తగ్గినప్పటికీ..వాటి వల్లే మంటలు వేగంగా వ్యాపింపజేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బాధిత ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed