అట్టహాసంగా అనంత్ అంబానీ పెళ్లి

by Hajipasha |
అట్టహాసంగా అనంత్ అంబానీ పెళ్లి
X

దిశ, నేషనల్ బ్యూరో : అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ వేడుకకు ముంబైలోని ముకేశ్ అంబానీకే చెందిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. వేలాది మంది వీఐపీలు, సెలబ్రిటీలు, వివిధ రంగాల అతిరథ మహారథులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ రాధిక మెడలో అనంత్ తాళిబొట్టును కట్టాడు. ఆద్యంతం హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక జరిగింది.

రస్ట్ ఆరెంజ్ రంగు షెర్వానీలో అనంత్..

వరుడు అనంత్ అంబానీ రస్ట్ ఆరెంజ్ రంగులోని షెర్వానీని ధరించి తళుక్కుమన్నాడు. ముంబైలోని తమ నివాసం యాంటిలియా నుంచి తెల్ల పూలతో అలంకరించిన రెడ్ కారులో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు అనంత్ చేరుకున్నాడు. కన్వెన్షన్ సెంటర్ ప్రవేశ ద్వారం నుంచి పెళ్లి మండపం వరకు సందడిగా సంగీత వాయిద్యాల నడుమ బరాత్ నిర్వహించారు. ప్రముఖ డిజైనర్ దంపతులు అబూ జానీ - సందీప్ ఖోస్లా తయారు చేసిన డిజైనర్ దుస్తులను ముకేశ్ అంబానీ ఫ్యామిలీలోని వారు ధరించారు. నీతా అంబానీ సారీ ధరించగా, ముకేశ్ అంబానీ షేర్వానీ ధరించారు. ముకేశ్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా క్రిస్టల్స్‌తో కూడిన పింక్ లెహెంగాలో మెరిసిపోయారు.

ముకేశ్ అంబానీ ఉద్వేగం

వివాహ బంధంతో ఓ ఇంటివాళ్లయిన అనంత్‌-రాధిక జంటను చూసి ముకేశ్ అంబానీ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటుండగా చూసి ముకేశ్ అంబానీ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. రాధిక తల్లిదండ్రులు కూడా అలాగే కనిపించారు. ఈ పెళ్లి కోసం ముకేష్ అంబానీ పెట్టిన ఖర్చు గురించి తెలిస్తే కళ్లు తిరుగుతాయి. ప్రీవెడ్డింగ్‌ వేడుకల వరకే అక్షరాలా రూ.1260 కోట్ల దాకా ఖర్చు చేశారు. పెళ్లి కార్యక్రమం ముగిసేనాటికి ఖర్చు రూ.1500 కోట్లు దాటేసిందని అంచనా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ఇది నిలిచిపోతుందని అంటున్నారు.

హాజరైన ప్రముఖులు వీరే..

ఈ పెళ్లివేడుకకు హాజరైన ప్రముఖుల్లో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి తదితరులు ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్, సౌదీ ఆరాంకో కంపెనీ సీఈవో అమీన్ నాసెర్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జే లీ, ఫార్మా దిగ్గజం జీఎస్‌కే సీఈవో ఎమ్మా వామ్‌స్లే, రజినీకాంత్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇండియా క్రికెట్ టీమ్‌కు చెందిన ప్రఖ్యాత ప్లేయర్లు కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed