Predator drones: భారత్, అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం

by Shamantha N |   ( Updated:2024-10-15 09:12:40.0  )
Predator drones: భారత్, అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై ఒప్పందం జరిగింది. సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి నిరంతరం ముప్పు పొంచివున్న వేళ.. సైన్యాన్ని మరింత పటిష్టపరిచేలా భారత్‌ కీలక ఒప్పందం చేసుకుంది. సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి అమెరికా నుంచి భారత్ 31 ఎంక్యూ9బీ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. వాటి నిర్వహణ, మరమ్మతు, సమగ్ర ఏర్పాటు కోసం రూ.32 వేల కోట్ల ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. వీటికి ప్రత్యేక మిసైల్స్, లేజర్‌ గైడెడ్‌ బాంబులను కూడా ఈ జనరల్‌ అటామిక్స్‌ సంస్థ సమకూర్చనుంది. ఈ మొత్తం 31 డ్రోన్లలో 15 నౌకాదళానికి, 8 సైన్యానికి, మిగిలినవి వాయుసేనకు కేటాయించనున్నారు.

డ్రోన్లు అవసరమంటున్న భారత్

ఆగస్టులో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికాలో పర్యటించారు. అప్పుడే ఆయన బృందానికి డ్రోన్‌ సామర్థ్యాలను ప్రదర్శించి చూపించారు. ఇప్పటికే పశ్చిమాసియా, అఫ్గాన్‌ సంక్షోభాల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడారు. ముఖ్యంగా చైనాతో సరిహ్దదుల వివాదాలు ఉండటంతో.. ఇవి అవసరమని భారత్ భావిస్తుంది. చాలా ఎక్కువ ఎత్తులో విహరించగలిగే ఈ డ్రోన్లు.. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. ఇవి నాలుగు హెల్‌ఫైర్‌ మిసైల్స్ ని, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్‌లో వీటిల్లో మరోరకమైన సీగార్డియన్‌ డ్రోన్లను వాడుతోంది. వీటిని కూడా జనరల్‌ అటామిక్స్‌ నుంచి లీజ్‌పై భారత్‌ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. నేవీ దీన్ని మరో నాలుగేళ్లపాటు పొడిగించింది. ఇకపోతే, భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ గత వారం 31 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. దీంతో, మంగళవారం ఈ ఒప్పందం జరిగింది

Advertisement

Next Story

Most Viewed