మా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు..స్పష్టం చేసిన కెనడా

by samatah |
మా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు..స్పష్టం చేసిన కెనడా
X

దిశ, నేషనల్ బ్యూరో: 2019, 2021 కెనడా ఎన్నికల్లో భారత్, పాక్‌లు జోక్యం చేసుకున్నాయని ఇటీవల కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆరోపించింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన కెనడా అధికారులు ఈ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. విదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు భారత్ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. 2021 ఎన్నికల్లో భారత్ కలుగ జేసుకున్నట్టు ఎటువంటి ఆధారాలూ లేవని తేల్చి చెప్పారు. సాక్ష్యాధారాలు సైతం ఏం లేవని తేల్చి చెప్పారు. అయితే కెనడాలో జరిగిన గత రెండు ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నట్టు వెల్లడైందని తెలిపారు. కాగా, 2019, 2021లో జరిగిన కెనడా ఎన్నికల్లో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు చెందిన లిబర్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని, తద్వారా ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ప్రధాని ట్రూడో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు జరుగుతుండగానే కమిషన్ భారత్, పాకిస్థాన్‌లు కూడా భాగమయ్యాయని ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ సహా పలు దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి కెనడా క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed