అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి

by John Kora |
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి
X

- బాప్స్ స్వామినారాయణ్ టెంపుల్‌పై గ్రాఫిటీ రాతలు

- ఎఫ్‌బీఐ విచారణకు హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్

- నీచమైన చర్యగా అభివర్ణించిన భారత్

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని ఓ హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కాలిఫోర్నియాలోని చినో హిల్స్ బాప్స్ స్వామినారాయణ్ మందిరంపై భారత్‌కు వ్యతిరేకంగా విద్వేషపు రాతలను రాశారు. గ్రాఫిటీ గ్రూప్ ఈ మందిరంపై విద్వేషం నింపేలా రాతలు రాసింది. అమెరికాలో మరో హిందూ టెంపుల్‌పై ఇలాంటి దాడే ఐదు నెలల క్రితం జరిగింది. కాగా బాప్స్ ఈ ఘటనపై స్పందించింది. హిందూ సమాజం ఈ విద్వేషానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడుతుందని తెలిపింది. చినో హిల్స్, సదరన్ కాలిఫోర్నియా కమ్యూనిటీ కలిసి ఈ విద్వేషాన్ని పాతుకపోకుండా చూస్తాము. మన ఉమ్మడి మానవత్వం, విశ్వాసం తప్పకుండా శాంతిని కోరుకుంటాయని బాప్స్ సోషల్ మీడియాలో పేర్కొంది.

బాప్స్ స్వామినారాయణ్ మందిరంపై 'హిందూస్ గో బ్యాక్' అంటూ గ్రాఫిటీ రాతలు రాశారు. కాగా, ఈ ఘటనపు హిందూస్ ఇన్ నార్త్ అమెరికా సంస్థ ఖండించింది. మీడియా, మేధావులు అసలు హిందూ వ్యతిరేకత లేదని, హిందూ ఫోబియా అనేది కేవలం ఊహా జనితమే అని ప్రచారం చేస్తాయి. కానీ ఇలాంటి సంఘటనలు వారికి కనపడవు అని హిందూస్ ఇన్ నార్త్ అమెరికా పేర్కొంది. 2022 నుంచి ఇప్పటి వరకు 10 హిందూ మందిరాలపై దాడి జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ జరపాలని హిందూ అమెరికా ఫౌండేషన్ డిమాండ్ చేసింది. పవిత్రమైన స్థలాల్లో యాంటీ హిందూ రాతలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడి వార్తలను చూశాం. ఇలాంటి నీచమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్సించాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ‌ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed