No Confidence Motion: ఉప రాష్ట్రపతిపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ?

by Hajipasha |   ( Updated:2024-12-09 15:59:13.0  )
No Confidence Motion: ఉప రాష్ట్రపతిపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ?
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజ్యస‌భ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌(Jagdeep Dhankhar)పై అవిశ్వాస తీర్మానాన్ని(No Confidence Motion) ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి(INDIA Bloc) యోచిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం ఈదిశగా ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం కాపీపై ఇండియా కూటమిలోని ముఖ్య పార్టీలైన కాంగ్రెస్(Congress), తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సమాజ్ వాదీ పార్టీ(ఎస్‌పీ)లకు చెందిన చాలామంది ఎంపీలు సంతకాలు చేశారని సమాచారం. రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని.. విపక్ష సభ్యుల ప్రసంగాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఇండియా కూటమి వాదిస్తోంది. వివాదాస్పద అంశాలపై సభలో చర్చలు జరిగే క్రమంలో బాహాటంగానే అధికార పార్టీకి అనుకూలంగా జగదీప్ ధన్‌ఖర్ మాట్లాడుతున్నారని ఆరోపిస్తోంది. ఈమేరకు ఆరోపణలతో రాజ్యస‌భ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ ఏడాది ఆగస్టులోనూ ఇండియా కూటమి ప్రయత్నాలు చేసింది. అప్పట్లోనే కూటమిలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీల సంతకాలను సేకరించింది. అయితే ధన్‌ఖర్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టలేదు. తాజాగా సోమవారం రోజు రాజ్యసభలో ప్రతిపక్ష నేతల పట్ల జగదీప్ ధన్‌ఖర్‌ వ్యవహరించిన తీరుతో ఇండియా కూటమికి మరోసారి ఆగ్రహం వచ్చింది. దీంతో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీరాలనే అభిప్రాయానికి కూటమిలోని ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్టికల్ 67(బీ) ఏం చెబుతోంది..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం.. ఉప రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే రాజ్యసభలో దానికి మెజారిటీ ఓట్లు రావాలి. అనంతరం 14 రోజుల్లోగా ఈ తీర్మానానికి లోక్‌సభలోనూ మెజారిటీ ఓట్లు పడాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితేనే ఉప రాష్ట్రపతి (రాజ్యసభ ఛైర్మన్)‌ని పదవి నుంచి తొలగించే వీలుంటుంది.

ఒకేరోజులో మూడుసార్లు రాజ్యసభ వాయిదా

అమెరికా బిలియనీర్ జార్జ్ సోరస్‌‌ నుంచి నిధులు పొందే సంస్థలతో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి సంబంధాలు ఉన్నాయనే అంశాన్ని రాజ్యసభలో ఎన్డీయే పక్ష నేత జేపీ నడ్డా లేవనెత్తారు. దీనిపై సభలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలంతా ఇదే డిమాండ్‌ను వినిపించారు. దీంతో ఈ అంశంపై మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ వాజ్‌పేయీకి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ అవకాశం ఇచ్చారు. లక్ష్మీకాంత్ వాజ్‌పేయీ దీనిపై మాట్లాడుతుండగా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ప్రజా సమస్యలతో ముడిపడిన అంశాలపై సభలో చర్చించాలని మేం కోరితే రూల్ 267 ప్రకారం రాజ్యసభ ఛైర్మన్ తోసిపుచ్చారు. అయితే ఇలాంటి వివాదాస్పద అంశాలపై మాత్రం మాట్లాడేందుకు బీజేపీ ఎంపీలకు అవకాశమిస్తున్నారు. ఇది అన్యాయం’’ అని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారం నుంచి దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఈ గగ్గోలు నడుమ సోమవారం రోజు రాజ్యసభ ఏకంగా మూడుసార్లు వాయిదా పడింది. అనంతరం రాజ్యసభలోని అధికార పక్ష నేత నడ్డా, విపక్ష నేత ఖర్గేలతో జగదీప్ ధన్‌ఖర్ భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు వారు మరొకసారి సమావేశం అవుతారు. ఈ మీటింగ్ తర్వాతే ఉప రాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై ఇండియా కూటమి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Next Story